బాల్క‌నీలో గొడ‌వ‌ప‌డ్డ భార్యాభ‌ర్త‌లు స‌డెన్‌గా భ‌వ‌నం నుంచి కింద ప‌డ్డారు.. వైర‌ల్ వీడియో..!

భార్యాభర్త‌లు అన్నాక వారి మ‌ధ్య గొడ‌వ‌లు అత్యంత స‌హజం. చిన్న చిన్న విష‌యాల‌కే చీటికీ మాటికీ గొడ‌వ‌లు ప‌డుతుంటారు. త‌రువాత అంతా స‌ర్దుకుంటుంది. మ‌ళ్లీ ఎప్ప‌టిలా క‌లిసిపోతారు. అయితే కొన్నిసార్లు గొడ‌వ‌లు ప్ర‌మాదాల‌కు దారి తీస్తాయి. అక్క‌డ కూడా స‌రిగ్గా అలాగే జరిగింది. ఇద్దరు దంప‌తులు గొడ‌వ ప‌డి బాల్క‌నీ వ‌ర‌కు వ‌చ్చి అక్క‌డ నుంచి ప్ర‌మాద‌వ‌శాత్తూ కింద ప‌డ్డారు. అయితే ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రూ చ‌నిపోలేదు. కేవ‌లం స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట ప‌డ్డారు.

ర‌ష్యాలోని సెయింట్ పీట‌ర్స్‌బ‌ర్గ్‌లో ఓల్గా వొల్కోవా, యెవ్‌గెని కార్లాగిన్‌లు భార్యాభ‌ర్త‌లు ఇద్ద‌రూ గొడ‌వ ప‌డ్డారు. వారు భ‌వ‌నం రెండో అంత‌స్తులో ఉన్నారు. బాల్క‌నీ వ‌ద్ద‌కు వ‌చ్చి గొడ‌వ‌ప‌డుతూ స‌డెన్‌గా కింద ప‌డ్డారు. దాదాపుగా 25 అడుగుల ఎత్తు నుంచి వారు కింద‌ప‌డ్డారు. అయితే చుట్టూ ఉన్న‌వారు వెంట‌నే స్పందించి వారిని ప‌రీక్షించి చూడ‌గా స్వ‌ల్ప గాయాలు మాత్ర‌మే అయిన‌ట్లు నిర్దారించారు. అయిన‌ప్ప‌టికీ వెంట‌నే వారిని ఆంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు.

ఆ ఇద్ద‌రికీ ప్ర‌మాద‌క‌ర‌మైన గాయాలు ఏవీ కాలేద‌ని, వారిప్పుడు బాగానే ఉన్నార‌ని వైద్యులు వెల్ల‌డించారు. అయితే వారు ఎందుకు గొడ‌వ‌ప‌డ్డారు అనే విష‌యంపై స్ప‌ష్ట‌త రాలేదు. త‌మ కుమారుడి విష‌యంలోనే వారు గొడ‌వ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. అయితే అదే స‌మ‌యంలో ఓ వ్య‌క్తి వీడియో తీసి దాన్ని సోష‌ల్ మీడియాతో పోస్టు చేయ‌గా, ఆ వీడియో వైర‌ల్‌గా మారింది.