కన్నప్ప భక్త కన్నప్పగా ఎలా మారాడో మీకు తెలుసా !

-

శివరాత్రి సందర్భంగా ఆ ముక్కంటి భక్తుల గురించి స్మరించుకుంటే చాలు శివానుగ్రహం మరింత లభిస్తుందని పురాణగాథలు పేర్కొంటున్నాయి. అలాంటి పరమ శివభక్తులలో కన్నప్ప ఒకరు. ఆయన భక్తి విశేషాలు తెలుసుకుందాం…

bhakta kannappa

పురాణాల ప్రకారం మహా శివుడికి 63 మంది ప్రసిద్ధ భక్తులు ఉన్నారు. వారిలో ‘తిన్నడు’ ఒకడు. తరువాత కాలంలో ఆయనే కన్నప్పగా ప్రసిద్దికెక్కాడు. తిన్నడు ఓ బోయవాడు, నాస్తికుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. కడప జిల్లాలోని ఓ గ్రామంలో జన్మించాడు. ఆయన అర్జునుడి అవతారం. ఒకానొకప్పుడు అర్జునుడు శివుడి కోసం గొప్ప తపస్సు చేసాడు. అర్జునుడి భక్తికి, తపస్సుకి మెచ్చిన శివుడు.. ఒకసారి అర్జునుడిని పరీక్షించాలనుకున్నాడు. అర్జునుడి తపస్సుకి భంగం కలిగించాలని ఓ అడవి పందిని పంపించాడు శివుడు. సహనం కోల్పోయిన అర్జునుడు కోపంతో ఆ పందికి బాణం వేశాడు. అదే సమయంలో బోయవాని వేషంలో వచ్చిన శివుడు కూడా ఆ పందికి బాణం వేశాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. మొత్తానికి అర్జునుడి పట్టుదల, ప్రయత్నానికి మెచ్చిన శివుడు.. అర్జునుడికి మహా శివుడిగా దర్శనమిచ్చాడు. అర్జునుడిని రెండు వరాలు కోరుకోమన్నాడు.

అప్పుడు అర్జునుడు మొదటిగా పశుపతా అస్త్రం కోరుకున్నాడు. ఆ వరాన్ని ప్రసాదించిన శివుడు.. దీనిని ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలవని అర్జునుడికి చెప్పాడు. తరువాత ఆ అస్త్రం తిరిగి మహా శివుని వద్దకు చేరుతుంది. రెండోవది మోక్షం. ఈ జన్మలో మోక్షం ప్రసాదించమని అర్జునుడు శివుణ్ణి కోరాడు. కానీ అందుకు శివుడు అంగీకరించలేదు. నీకు ఈ జన్మలో మోక్షం ప్రసాదించలేను. ఎందుకంటే, నువ్వు నీ బంధువులైన కౌరవులను చంపడానికి ఆయుధాన్ని అడిగావు. అందుకే ప్రసాదించలేను. నువ్వు శివుడి మోక్షం పొందాలంటే మరో జన్మ ఎత్తాలి అని చెప్పాడు. అలా అర్జునుడు మరో జన్మలో తిన్నడుగా జన్మించాడు. ఒకసారి తిన్నడు శ్రీకాళహస్తి సమీపంలోని అడవికి వేటకి వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక అడవి పంది కనిపిస్తే.. దాన్ని వేటాడి, తినడానికి కాల్చుకున్నాడు. అతను కాళ్ళు కడుక్కొని.. ఆ కాల్చిన పంది మాంసం తినాలి అనుకున్నాడు. చేతిలో పందిని పట్టుకొని.. నీళ్ల కోసం చుట్టుపక్కల వెతుకుతుండగా అతనికి పూలతో అలంకరించిన ఒక శివలింగం కనిపించింది.

చాలాకాలం నుంచి శివుడికి ఎవరూ నైవేద్యం పెట్టడం లేదని భావించిన తిన్నడు.. తన దగ్గరున్న పంది మాంసం పెట్టాలనుకుంటాడు. అంతలోనే మళ్ళీ.. స్నానం చేయకుండా శివుడు ఎలా తింటాడు? అని ఆలోచిస్తూ.. పక్కన ఉన్న సరస్సు దగ్గరికి వెళ్ళాడు. చేతుల్లో పంది మాంసం ఉండడంతో నోటితో నీటిని తీసుకొని శివలింగం దగ్గరికి వచ్చాడు. కాలికున్న చెప్పులతో శివలింగం మీదున్న పూలను పక్కకి నెట్టి.. నోట్లో ఉన్న నీటిని శివలింగం మీద పోసాడు. పక్కనున్న పూలు, ఆకులు తీసుకొచ్చి శివుణ్ణి అలంకరించాడు. తరువాత తన వద్దనున్న పంది మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టాడు. దాన్ని శివుడు ఆరగించాడు. అప్పటినుంచి తిన్నడు ప్రతిరోజూ అలాగే చేయడం మొదలుపెట్టాడు. అయితే శివుడు పంది మాంసం తినడం వెనుక ఒక కథ ఉంది. అప్పట్లో సుందర శ్రీరాస అనే రాక్షసులు ఉండేవారు. వారు శివుడి కోసం గొప్ప తపస్సు చేసి, మోక్షాన్ని ప్రసాదించమని కోరారు. అప్పుడు శివుడు.. వచ్చే జన్మలో మీరు అడవిలో జంతువుల్లా జన్మిస్తారని చెప్తాడు. వేటగాడు జంతువు రూపంలో ఉన్న వారిని వేటాడి.. ఆ మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెడతాడు. అప్పుడు శివుడు ఆ మాంసం తినడం వల్ల వారికి మోక్షం కలుగుతుంది. అందుకే శివుడు తిన్నడు పెట్టిన మాంసాన్ని తిన్నాడు.

శివగోచర అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. శివుడు మాంసం తిన్నాడని, శివుడికి నోటితో తెచ్చిన నీటితో పూజ జరిగిందని, శివలింగం మీదున్న పూలు కాలి చెప్పులతో తీయబడ్డాయని తెలుసుకొని శివగోచర బాధపడ్డాడు. ఆ బాధని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన తలని శివలింగానికి కొట్టుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు ‘అలా చేయకు. కాసేపు అలా పక్కన దాక్కొని వేచి చూడు’ అని ఒక మాట వినిపించింది. అది విని శివగోచర శివలింగం వెనుక దాక్కున్నాడు. కొంచెం సేపటికి.. తిన్నడు రోజు లాగానే చేతిలో మాంసం, నోట్లో నీళ్లు మరియు పూలతో వచ్చాడు. పూలతో అలంకరించిన తరువాత తాను తెచ్చిన పంది మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టాడు. కానీ శివుడు తినలేదు. దీంతో తాను పెట్టిన నైవేద్యాన్ని శివుడు ఈరోజు ఎందుకు తినట్లేదని అనుకుంటూ బాధగా శివలింగం వైపు చూసాడు. శివలింగం ఒక కంటిలో నుండి రక్తం రావడం గమనించిన తిన్నడు.. వెంటనే తన కంటిని పీకి రక్తం వస్తున్న శివుడి కంటి దగ్గర పెట్టాడు.

తరువాత శివలింగం మరో కంటి నుండి కూడా రక్తం రావడం మొదలైంది. అప్పుడు తిన్నడు తన రెండో కంటిని కూడా తీయడానికి సిద్దమయ్యాడు. కానీ ‘తన రెండో కంటిని కూడా తీసేస్తే పూర్తిగా గుడ్డివాడిని అవుతాను. అప్పుడు తన రెండో కంటిని ఎక్కడ పెట్టాలో కనిపించదు’ అని ఆలోచించి.. ముందుగా తన కాలిని రక్తం కారుతున్న శివలింగం రెండో కన్ను దగ్గర ఉంచి.. తన రెండో కంటిని పీకబోతుండగా.. అతని భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై తిన్నడికి కంటిని తిరిగిచ్చి చూపు ప్రసాదించాడు. ఇదంతా శివలింగం వెనుక ఉండి చూసిన శివగోచర.. తిన్నడు భక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. అతను ఎంత గొప్ప భక్తుడో తెలుసుకున్నాడు. అలా తిన్నడు కన్నప్పగా మారాడు. కన్నప్ప అంటే తన కంటిని వేరొకరికి దానం చేసినవాడు అని అర్థం. శివ భక్తుల కథ విన్నా, చదివినా శివానుగ్రహం కలుగుతుంది.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news