తెలుగు సంవత్సరాది “ఉగాది”. అంటే కొత్త యుగానికి నాంది పలికిన రోజుని ఉగాది అంటారు. భారతీయ సాంప్రదాయం ప్రకారం సృష్టి ఏర్పడింది అని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఉగాది రోజు నుంచే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. వసంత ఋతువు మొదలవుతుంది. ఆకురాల్చిన చెట్లన్నీ చిగురించి ప్రకృతి పచ్చగా శోభాయమానంగా కనిపించే కాలం. ఈ కాలంలో మామిడి చెట్లు పూత, పిందెలతో, నిండి ఉదయాన్నే కోయిల కూతతో ప్రకృతి పరవశిస్తుంది. కొత్తగా మొదలుపెట్టే పనులు ఈ ఉగాది రోజు నుంచే మొదలు పెడతారు అంటే, ఈ రోజు కు ఎంత ప్రాధాన్యం ఉంది అనేది మనం గ్రహించవచ్చు.
ఉగాది రోజు మరొక విశేషం ఏమిటంటే ఆ రోజు మాత్రమే ప్రతి ఇంటిలోనూ తప్పక చేసుకునే “ఉగాది పచ్చడి”. ఈ ఉగాది పచ్చడికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. అదేంటంటే ఇది షడ్రుచులు సమ్మేళనం, అంటే ఈ ఉగాది పచ్చడి తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే ఆరు రుచులతో ఉగాది పచ్చడి తయారుచేస్తారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఈ ఉగాది రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ముందు గా ఈ ఉగాది పచ్చడి తిన్న తరువాతే మిగతా కార్యక్రమాలు నిర్వహిస్తారు. చాలా చోట్ల ఈ ఉగాది పచ్చడి నీ వేపపువ్వు పచ్చడి అని కూడా అంటారు.
ఇది తయారు చేయడం చాలా సులువు, అంతే కాకుండా ఒక ప్రత్యేకమైన రుచి కలిగి ఉంటుంది ఈ పచ్చడి. బాగా మగ్గిన అరటిపండ్లను తొక్క తీసి ఒక గిన్నెలో వేసి వాటిని చేతితో బాగా మెత్తగా చిదిమి, దాన్లో 1 కప్పు చింతపండు రసం పోసి, కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ కొత్త కారం, 1 కప్పు తురిమిన బెల్లం, 1 చిన్న మామిడికాయ ముక్కలు, 1/2 కప్పు కొబ్బరి తురుము, 1/2 కప్పు పుట్నాలపప్పు 1/2 కప్పు శుభ్రం చేసిన వేపపువ్వు ,వేసి అన్నీ పదార్థాలు బాగా కలిసే వరకు కలిపితే ఉగాది పచ్చడి రెడీ అవుతుంది (ఇష్టాన్ని బట్టి చెరుకు ముక్కలు కూడా వేసుకుంటారు) . ఇది ఆరోగ్య పరంగా చాలా మంచిది. అంతే కాకుండా ఈ పచ్చడి సంవత్సరం అంతా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను ఒకే రకంగా స్వీకరించాలనీ ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది అని మన పెద్దలు మనకు తెలియజేశారు.