ఉగాది అనగా మన తెలుగు వారి పండగ. కొత్త సంవత్సరం మొదలవుతుంది. కనుక ఇది తెలుగు వారి మొదటి పండగ. అందుకని రాశిఫలాలు, గ్రహ స్థితులు చూసుకుని గ్రహ శాంతులు జరిపించుకుంటారు. పంచాంగ శ్రవణం చేస్తారు.చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మిచడం ప్రారంభించాడని పురాణ గాథ. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే ప్రారంభం అవుతుంది కనుక కొత్త జీవితానికి నాంది గా ఉగాదిని జరుపు కుంటారు.
ఉగాది రోజు వేకువ జామునే లేచి నిత్యం చేసే పనులు ముగించుకుని స్నాన సంధ్యలు కానిచ్చి ఉగాది పచ్చడి చేసుకుంటారు. రకరకాల పిండి వంటలతో అమ్మవారికి, విష్ణు మూర్తి కి నైవేద్యం సర్పిస్తారు.దేవాలయాలలో ఏర్పాటు చేసే పంచాంగ శ్రవనానికి వెళ్తారు. ముఖ్యంగా ఉగాది పచ్చడి కొంచెమైనా సేవించాలి. ఉగాది పచ్చడి లాగే మన జీవితం కూడా షడ్రుచుల సమ్మేళనం అని తెలియడానికి ఈ సాంప్రదాయం.
ఉగాది రోజు నుంచే చలివేంద్రాలు ఏర్పాటు చేయడం మొదలు పెడతారు. ఎండలు తీవ్రత దృష్ట్యా ఈ రోజు నుంచే అన్ని చోట్ల చలివేంద్రం ఏర్పాట్లు చేస్తారు. అంతే కాకుండా ఈ రోజు మిత్ర దర్శనం కూడా చేస్తారు. అంటే ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉంటారు కాబట్టి ఎటు వంటి ఒక సంప్రదాయం ఏర్పాటు చేయడం వల్ల కనీసం ఈ రోజైనా మిత్రులను కలిసి ఆనందం గా గడుపుతారని దీనిలోని పరమార్థం.
ఉగాది రోజు ఆర్య పూజ అనే ఒక సాంప్రదాయం కూడా మనకు అందుబాటులో ఉంది. అంటే పెద్దలను పూజించడం అని దీని భావం. ఈ రోజు చేయవలసిన మరొక సాంప్రదాయం గోపూజ. హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. భారత దేశం లో గోవును దేవతగా కొలుస్తారు. కాబట్టి ఉగాది రోజు తప్పనిసరిగా గోమాతను పూజించాలి అని పెద్దలు తెలియజేశారు.