సూపర్‌ ఫుడ్‌ – ఎముకల సూప్‌ (షోర్వా)

అనాదిగా దీన్ని తాగే అలవాటు భారత్‌లో ఉంది. ముఖ్యంగా తెలంగాణలో కాళ్ల షోర్వా, బొక్కల పులుసుగా పిలువబడే ఈ బోన్‌ సూప్‌ లేదా బోన్‌ బ్రాత్‌ను హైదరాబాద్‌లో ‘పాయా’గా వ్యవహరిస్తారు. తిరుగులేని ఆరోగ్యాన్ని, శక్తిని అందించే ఆహారంగా దీనికి మంచి పేరు.

బోన్‌ బ్రాత్‌ లేదా ఎముకల షోర్వా, ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందింది కానీ, తెలంగాణ రాష్ట్రంలో బాగా పాపులర్‌. చాలా ఏళ్ల క్రితం నుండే దీన్ని సేవిస్తున్నట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్లలో కాళ్లుచేతులు విరగ్గొట్టుకున్నవారు, సన్నగా పీలగా ఉండేవారు, దీర్ఘకాలిక వ్యాధులనుండి బయటపడినవారిని ఈ సూప్‌ తాగాల్సిందిగా పెద్దవాళ్లు ఇప్పటికీ చెపుతుంటారు. ముఖ్యంగా ముస్లింలు బాగా ఇష్టంగా తాగే డ్రింక్‌ ఇది. పాయా పేరుతో హైదరాబాద్‌లోని చాలా కేఫ్‌లలో ఇది దొరుకుతుంది. కొన్ని కేఫ్‌లయితే దీనికే ప్రసిద్ధి. ఉదయం పూట 7 గంటలకే ఈ పాయా కోసం హోటళ్లు కిటకిటలాడుతుంటాయి. బన్‌ రొట్టెతో కాంబినేషన్‌లో సర్వ్‌ చేస్తారు.

పోషక విలువలు

జంతువుల రకరకాల స్థానాల్లోని ఎముకలను ముక్కలుగా కొట్టి, సూప్‌లో వాడతారు. వాటితో పాటు ఉండే కొద్దిపాటి మాంసం, కణజాలం కూడా ముఖ్యమే. ఈ పాయాలో విపరీతమైన పోషకాలుంటాయి. జంతు ఎముకలలో కాల్షియం, మెగ్రీషియం, పొటాషియం, ఫాస్ఫరస్‌.. ఇంకా శరీర ధారుఢ్యానికి, ఎముకల ధృడత్వానికి  అవసరమయ్యే ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. చేపల ఎముకలు కూడా మంచివే. వాటిలో అయోడిన్‌ఉంటుంది. అది థైరాయిడ్‌ గ్రంథి బాగా పనిచేసేందుకు, జీవక్రియల వేగం పెంచేందుకు ఉపయోగపడుతుంది.

ఈ ఎముకలతో పాటు ఉండే మృదుకణజాలం, నిజానికి ఎముకలను కలిపిఉంచేందుకు ఉపయోగపడుతుంది. షోర్వాలో కలిసిపోయిఉండే దీని వల్ల గ్లుకోజమిన్‌, కాండ్రాటిన్‌ వృద్ధి చెందుతాయి. ఇది కీళ్ల మధ్య ఉండే మృదులాస్థిని ఆరోగ్యంగా చేసి కీళ్ల నొప్పులను నివారిస్తుంది.ఎముకల్లో ఉండే మజ్జ లేదా మూలుగ వల్ల విటవిన్‌ ఏ, కె2లు, ఖనిజాలైన జింక్‌, ఇనుము, బొరాన్‌, మాంగనీస్‌ లాంటివి.. ఇంకా ఒమేగా3, 6 ఫ్యాటీ ఆసిడ్లు అందుతాయి.చాలామందికి తమ ఆహారంలో ఇన్ని రకాల పోషకాలు అందవు. అందుకని కనీసం వారానికి ఒకసారైనా బోన్‌ సూప్‌ను తాగితే చాలా మంచిది.

ఈ షోర్వాలో రకరకాల ఎముకలను వాడటం చాలా మంచిది. ఒక్కో ఎముకలో ఒక్కోరకమైన పోషకాలు ఉంటాయి. మటన్ షాపులో అడిగితే అన్ని రకాల ఎముకలూ ఇస్తారు.

ఎలా చేస్తారు?

ఇది చాలా సులువు. కోడి, మేక, గొర్రె ఎముకలను తీసుకుని, బాగా కడిగి, ఒక పెద్ద గిన్నెలో వేస్తారు. వాటితో పాటు ఆపిల్‌ సిడర్‌ వినెగర్‌.. రుచి, సువాసన కోసం మసాలా దినుసులు, మిరియాలు, పచ్చిమిర్చి, ఉప్పు, ఉల్లి, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా లాంటివి వేసి, బాగా నీళ్లు పోసి, సన్నని మంట మీద ఉడికిస్తారు. ఇది ఎంతసేవు ఉడికితే అంత మంచిది. పోషకాలన్నీ నీళ్లలోకి దిగి, మన శరీరం గ్రహించే స్థాయికి కరుగుతాయి. అన్నట్లు ఈ షోర్వాను 4 లేదా 5 రోజుల పాటు ఫ్రిజ్‌లో కూడా ఉంచవచ్చు.

మీ అభిరుచిని బట్టి, కొన్ని కూరగాయలు కూడా వేసుకోవచ్చు. అయితే వినెగర్‌ అనేది చాలా ముఖ్యమైన దినుసు. ఇది ఎముకల్లోనుండి పోషకాలను బయటికి తీసుకొచ్చేందుకు పనిచేస్తుంది.

ఎంత మంచిది?

మన జీర్ణవ్యవస్థ ఎంత బాగుంటే, మన ఆరోగ్యం అంత బాగుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పాయా ఈ విషయంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అది త్వరగా జీర్ణమవడమే కాక, ఇతర ఆహార పదార్థాలను కూడా తొందరగా అరిగిస్తుంది. ఇందులో ఉండే జెలటిన్‌ అనే ఒకరకమైన ప్రొటీన్‌ ద్రవపదార్థాలను పట్టిఉంచుతుంది. దానివల్ల ఆహారపదార్థాలు జీర్ణాశయంలో సులువుగా కదులుతాయి. అంతేకాక, జీర్ణాశయ గోడలపై ఉండే రక్షణపొరను కాపాడుతుంది.

బొక్కల షోర్వాలో ఉండే అమైనో ఆమ్లాలు, గ్లైసిన్‌, ఆర్జినైన్‌లు కడుపులో మంట, వాపు, కీళ్లనొప్పులను తగ్గించే అద్భుతమైన గుణం కలవి. అర్జినైన్‌లు ఎక్కువగా ఉన్న శరీరంలో మంట తగ్గుముఖం పట్టినట్లు ఒక పరిశోధనలో తేలింది. కొంతమేరకు ఈ కడుపు మంటను ఓర్చుకున్నా, అది తీవ్రమైన వ్యాధులకు దారితీసే ప్రమాదముంది.

కీళ్ల నొప్పులకు అమృతంలా పనిచేస్తుందీ పులుసు. ఇందులో ఉండే కొలాజెన్‌ అనే ప్రొటీన్‌ అది ఉడుకుతున్నప్పుడు విడిపోయి ఇంకో ప్రొటీన్‌, జెలటిన్‌గా మారుతుంది. ఈ ప్రొటీన్‌ కీళ్లు, ఎముకలను కలిపిఉంచే కండరాలను బలోపేతం చేస్తుంది. తద్వారా కీళ్ల నొప్పులు త్వరగా మాయమవుతాయి.

ఎముకల షోర్వా బరువు తగ్గడంలో బాగా కలిసొస్తుంది. ఇందులో చాలా తక్కువగా కెలొరీలు ఉంటాయి. అదే సమయంలో ఆకలినీ చంపేస్తుంది. పరిశోధనల ప్రకారం రెగ్యులర్‌గా దీన్ని తాగితే, కెలొరీల చేరిక తగ్గి, తద్వారా బరువు తగ్గే అవకాశముంది.  కండరాల స్థాయిని పెంచి, శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది.

ఒత్తిడిని తగ్గించి, సేద తీర్చే గుణముంది ఈ పాయాలో. నిద్ర కూడా హాయిగా పడుతుంది. ఇందులో ఉండే అమైనో ఆమ్లం గ్లైసిన్‌ నిద్రానాణ్యతను పెంపొందిస్తుంది.

బోన్‌ బ్రాత్‌ ఎన్నో పోషకాలను కలిగిఉండటం మూలాన, అద్భుతమైన ఆరోగ్య లాభాలున్నాయి. ఇప్పుడిప్పుడే దేశదేశాల్లో దీనిపై ఆసక్తి పెరిగి, పరిశోధనలు ఊపందుకున్నాయి. అదృష్టవశాత్తు మనకు ఇది మన దేశానికి ముందే తెలుసు.  కానీ వాడకం బాగా వెనుకబడిపోయంది. వెంటనే దీన్ని మీ ఆహారపు అలవాట్లలో చేర్చుకోండి. కనీసం వారానికొకసారైనా బోన్ సూప్‌ను తాగే అలవాటు చేసుకోండి.