పల్లి పట్టిలు తెలియని వారుండరూ. తక్షణ శక్తి కోసం పల్లి పట్టిలను తినేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండే పల్లీలు (వేరుశెనగ కాయలు) ద్వారా పల్లి పట్టిలు తయారు చేస్తుంటారు. బరువు పెరగాలని అనుకునే వారు పల్లీలను తినడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. పల్లీల ద్వారా శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వు లభిస్తుంది. పల్లీలను ఎక్కువగా వంటల్లో కూడా వాడుతుంటారు.
వేరు శెనగల్లో అధిక మొత్తంలో మాంసకృత్తులు లభ్యమవుతాయి. కోడిగుడ్డులో దొరకే ప్రోటీన్ల కన్నా వేరుశెనగల్లో ఉండే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. మన శరీరానికి అవసరమైన ఏ, ఈ విటమిన్స్ అధికంగా దొరుకుతాయి. దక్షిణ భారత దేశంలో తయారుచేసే అత్యుత్తమ తీపి పదార్థాలలో పల్లి పట్టిలు ప్రత్యేకమైనవి. తెలుగు రాష్ట్రాల్లో వీటిని చిక్కిలు కూడా అంటారు.
వేరుశనగలను కాల్చి.. బెల్లంపాకలో వేసి పల్లి పట్టిలను తయారు చేస్తుంటారు. తక్షణ శక్తి కోసం చాలా మంది పల్లి పట్టిలను తింటుంటారు. పల్లిలను బెల్లంతో కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. శరీరాన్ని సమతుల్యం చేసేందుకు వీలుపడే ప్రోటీన్స్, పాస్పరస్, నియాసిస్, థయామిన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. పెరిగే పిల్లలు, గర్భిణులు, బాలింతలు పల్లి పట్టిలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను అందిస్తాయి.
వేరుశెనగలను బెల్లంతో కలిసి తినడం వల్ల ఐరస్ ఎక్కువగా లభిస్తుంది. దీని వల్ల ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. అందుకే క్రీడాకారులు సైతం పల్లి పట్టిలను తినేస్తుంటారు. పల్లిపట్టిలో విటమిన్-ఏ పుష్కలంగా ఉంటుంది. దీంతో కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే ఇందులో విటమిన్-ఈ కూడా అధికంగా ఉంటుంది. చర్మం ఆరోగ్యవంతంగా ఉండేందుకు విటమిన్-ఈ తోడ్పడుతుంది. రోజూ బెల్లం పట్టిలు తినడం వల్ల గుండె పనితీరు మెరుగు పడుతుంది.
పల్లి పట్టిలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కేవలం వేరుశెనగలు (పల్లీలు), బెల్లం ఉంటే సరిపోతుంది. కొంచెం పెద్దగా ఉన్న వేరుశెనగలను తీసుకుని ప్యాన్ పై కాల్చుకోవాలి. కాసేపటి తర్వాత కిందికి దించి పల్లీలపై ఉన్న పొట్టును తొలగించి పక్కన పెట్టుకోవాలి. బెల్లం పాకం తయారు చేసి అందులో పల్లీలను కలిపేసి సైజు, పరిణామం ప్రకారం తయారు చేసుకోవాలి.