కరోనా లాక్‌డౌన్ సమయాన్ని నిజానికి కొందరు చాలా చక్కగా ఉపయోగించుకున్నారు. కొందరు ఆన్‌లైన్‌లో డబ్బులు సంపాదించడం ప్రారంభిస్తే.. కొందరు కొత్త కొత్త కోర్సులను నేర్చుకుని తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకున్నారు. ఇలా ఖాళీ సమయాన్ని కొందరు పూర్తిగా ఉపయోగించుకున్నారు. ఇక కొందరు పిల్లలు కూడా ఏమీ తక్కువ తినలేదు. లాక్‌డౌన్ వల్ల ఒక బాలిక వంటలు చేయడంలో నిష్ణాతురాలు అయింది. ఎన్నో వంటకాలను చేయడం నేర్చుకుంది. ఇప్పుడు వరల్డ్ రికార్డు సాధించింది.
తమిళనాడులోని చెన్నైకి చెందిన ఎస్ఎన్ లక్ష్మీ సాయిశ్రీ అనే బాలిక 58 నిమిషాల్లోనే 46 వంటకాలు చేసి వరల్డ్ రికార్డు సృష్టించింది. ఆమె ఆ ఫీట్ సాధించి యునికో బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. లాక్‌డౌన్ సమయంలో ఆ బాలిక తన తల్లికి ఎక్కువగా కిచెన్‌లో సహాయం చేసేది. వంటలను చేయడం నేర్చుకుంది. కొత్త కొత్త వంటకాలను ట్రై చేసేది. ఈ క్రమంలోనే ఆమె ఆ రంగంలో నిపుణత సాధించింది.
అయితే ఆగస్టులో కేరళకు చెందిన శాన్వి అనే 10 ఏళ్ల బాలిక గంటలోనే 33 రకాల వంటకాలు చేసి రికార్డు సృష్టించింది. దీంతో ఆమె రికార్డును లక్ష్మీసాయి బ్రేక్ చేయాలని అనుకుంది. అనుకున్నట్లుగానే గంటలోనే 46 డిషెస్‌ను చేసి కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో కొత్త రికార్డును సాధించినందుకు సంతోషంగా ఉందని తెలియజేసింది.