వాల్‌నట్స్ నిజానికి ఇతర నట్స్ లా అంత రుచికరంగా ఉండవు. అందువల్ల వీటిని చాలా మంది తినేందుకు ఇష్టపడరు. కానీ సైంటిస్టులు చెబుతున్న ఓ విషయం తెలిస్తే మీరు రోజూ వాల్ నట్స్ ను కచ్చితంగా తింటారు. అదేమిటంటే.. నిత్యం గుప్పెడు వాల్ నట్స్ ను తినడం వల్ల గుండె జబ్బులు రావని వారు తెలిపారు. ఈ మేరకు వారు తాజాగా ఓ పరిశోధన చేపట్టారు.
హాస్పిటల్ క్లినిక్ ఆఫ్ బార్సిలోనా, లోమా లిండా యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు 600 మందిని రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపు వారికి నిత్యం 30 నుంచి 60 గ్రాముల వరకు వాల్‌నట్స్ ను తినమని చెప్పారు. మరొక గ్రూప్ వారికి వాల్ నట్స్‌ను తినవద్దని సూచించారు. 2 ఏళ్ల పాటు సుదీర్ఘంగా వారిని పరిశీలించారు.
ఈ క్రమంలో సైంటిస్టులు గుర్తించిందేమిటంటే.. నిత్యం వాల్ నట్స్ ను తిన్నవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తేల్చారు. వాల్‌నట్స్‌లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఆల్ఫా లినోలినిక్ యాసిడ్ తదితర పోషక పదార్థాలు గుండె జబ్బులు రాకుండా చూస్తాయని నిర్దారించారు. అందువల్ల నిత్యం గుప్పెడు వాల్ నట్స్ ను తినడం వల్ల గుండె జబ్బులు రావని సైంటిస్టులు చెబుతున్నారు.