ఉడకబెట్టిన Vs కాల్చిన మొక్కజొన్న.. వైద్యులు ఏది మంచిదంటున్నారంటే..

-

బయట వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ టైమ్‌లో వేడి వేడిగా ఏదో ఒకటి తినాలని ఆత్మరాముడు ఓ గోలపెడుతుంటాడు. మనం కూడా లాగించేస్తుంటాం. ఇప్పుడు బయట ఎక్కువగా దొరికేవాటిల్లో మొక్కజొన్న పొత్తులు ముందు ఉంటాయి. చిన్న బల్లమీద ఒక పక్క మొక్కజొన్నపొత్తులు, మరోపక్క బొగ్గులు, వర్షంలో తడుస్తూనే వాటిని కాల్చుతుంటారు. అప్పుడు అలా అలా వాటిని తింటే ఉంటది..అబ్బా.. ఏం టేస్ట్‌ రా.. పక్కనే ఇంకో బండి.. అందులో బాగా మరుగుతున్న వాటర్‌.. అందులోంచి తీసిన మొక్కజొన్నపొత్తులు.. వాటికి లైట్‌గా ఉప్పు, కారం, మసాలా అలా అలా రాసి ఇస్తే.. వాటిని తింటే.. అబ్బో టేస్ట్‌ నెక్స్ట్‌ లెవల్‌ అంతే.. అసలు ఇప్పుడు ఏంటండీ ఇలా ఊరిస్తున్నారు. మ్యాటర్‌ చెప్పకుండా అంటారేమో.. అక్కడికే వస్తున్నా.. ఈ మొక్కజొన్న పొత్తులను ఎలా తింటే హెల్తీ.. కాల్చుకునా లేక ఉడకబెట్టా..? తెలుసుకుందామా..!

మొక్కజొన్న పొత్తులు ఎందుకు తినాలి..?

ఎలా తింటే ఏంటి.. అవి ఆరోగ్యానికి మంచివైనప్పుడు ఎలాగోలా తింటున్నాంగా అంటారేమో.. అసలు ఫస్ట్‌ వీటిని ఎందుకు తినాలో చూద్దాం.. ఆ తర్వాత ఎలా తినాలో తెలుసుకుందాం. దీనిలో ఫైబర్, విటమిన్ బి, విటమిన్ ఏ, నియాసిన్, ఐరన్, పొటాషియం, జింక్, మాంగనీస్, మెగ్నీషియం వంటి పోషకాలు నిండుగా ఉంటాయి. వీటిని తినడం వల్ల జీర్ణశక్తికి మేలు జరుగుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. డయాబెటిస్ రోగులు మొక్కజొన్నను కచ్చితంగా తినాలి. దీన్ని తినడం వల్ల వారి రక్తంలో చక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి.

అంతేకాదు మొక్కజొన్న చర్మ సౌందర్యానికి కూడా మేలు చేస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. యాంటీ ఏజింగ్ లక్షణాలు దీనిలో ఎక్కువ. జుట్టును కూడా ఆరోగ్యంగా మారుస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లను కూడా రాకుండా అడ్డుకుంటుంది. పిల్లలకు మొక్కజొన్నలు తినిపించడం ద్వారా… వారి ఎదుగుదలకు ఎంతో సహాయపడుతుంది. సన్నగా ఉన్న పిల్లలకు మొక్కజొన్నలు తినిపించడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.

మొక్కజొన్న పొత్తులు ఎలా తినాలి..?

అయితే ఇంత మంచి మొక్కజొన్న కండెలను ఉడికించి తినాలా, కాల్చి తినాలా అనే సందేహం ఎక్కువమందిలో ఉంది. నిజానికి మొక్కజొన్నను నీళ్లలో ఉడికించి తింటేనే ఎక్కువ ఆరోగ్యకరం. ఎలాంటి చెడు ప్రభావాలు ఉడికించిన మొక్కజొన్నలు కలిగించవు. కానీ కాల్చిన మొక్కజొన్నలు తినడం వల్ల మొక్కజొన్న గింజల్లో కొన్ని నల్లగా పైపైన మాడిపోతాయి. ఇలా నల్లగా మాడిన ఆహారాన్ని తినకూడదని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. అలా నల్లగా మాడిన ఆహారంలో క్యాన్సర్ కారకాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి కాల్చుకున్న మొక్కజొన్న కంటే ఉడికించిన మొక్కజొన్న తినడమే ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. అలాగే వాటిపై పచ్చి ఉప్పు, కారాన్ని రాసుకోవడం తగ్గించండి. పచ్చి ఉప్పు, కారం తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా పచ్చి ఉప్పు వల్ల అధిక రక్తపోటు బారిన త్వరగా పడతారు. ఉడికించిన మొక్కజొన్నను అలా సాదాగా తినేందుకే ప్రయత్నించండి. అవసరమైతే నిమ్మకాయను రుద్దుకొని తింటే రుచి బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version