పెరుగుతున్న డెంగ్యూ మరణాలు.. బొప్పాయి ఆకుల రసం మీదనే ఆధారపడుతున్నారా..?

-

ఈ సీజన్‌లో డెంగీ జ్వరాలు ఎక్కువగా వస్తుంటాయి. కొన్నిసార్లు ఇవి ప్రాణాంతకం కూడా అవుతాయి. ఇప్పుటికే తెలుగు రాష్ట్రాల్లో డెంగీ వల్ల చనిపోయే వారి సంఖ్య అక్కడక్కడ నమోదవుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలే ఈ జ్వరం బారిన ఎక్కువగా పడతారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం దీనికి ప్రధాన కారణం. అయితే చాలా మంది.. ఈ జ్వరం వచ్చింది అనగానే.. బొప్పాయి ఆకుల రసం మూడు రోజులు తాగితే చాలు.. దెబ్బకు తగ్గిపోతుంది అంటారు. కొబ్బరినీళ్లు కూడా ఎక్కువగా తాగిస్తుంటారు. అసలు వీటివల్ల నిజంగా ప్రయోజనాలు ఉన్నాయా..? ఒకవేళ ఉంటే.. డెంగీ వల్ల కూడా జనాలు ఎందుకు చనిపోతున్నారు..? ఇవి అరుదైన వస్తువులేం కాదు కదా..! ఎక్కడైనా దొరుకుతాయి. అసలు వీటిని ఎంత మోతాదులో ఏ స్టేజ్‌ వరకు తీసుకోవాలి..? అన్నీ సమస్యలకు ఒకటే పరిష్కారం ఎప్పుడూ పనిచేయదు.. డెంగీ వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ బొప్పాయి ఆకుల రసం, కొబ్బరినీళ్లు ఇస్తే జ్వరం తగ్గిపోతుంది అనుకోవడం ఎంత వరకూ కరెక్టు.?

సాధారణంగా మనిషికి ఏ రకమైన జ్వరం వచ్చినా అతని శరీరంలో ప్లేట్‌లెట్లు తగ్గుతాయి. రోగి శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం, బలహీనంగా ఉండటం లాంటి కారణాల వల్ల ఇలా జరుగుతుంది. అయితే డెంగ్యూ జ్వరం విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. జ్వర తీవ్రత తగ్గే కొద్దీ మళ్లీ శరీరంలో ప్లేట్‌లెట్లు పెరగడం మొదలవుతుంది. ఇది సహజమైన ప్రక్రియ.

ఇంటి వైద్యం వద్దు..

ఇలా జ్వరంతో బాధ పడుతున్న వారు కేవలం బొప్పాయి ఆకుల రసం తాగడం, కొబ్బరి బొండం నీరు తాగడం చేస్తుంటారు. కేవలం వీటి వల్ల మాత్రమే ప్లేట్ లెట్లు పెరుగుతాయనుకోవడం పూర్తిగా మీ పొరపాటే. వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడుకోవడం తప్పనిసరి. వాటితో పాటు కొద్ది మోతాదులో వీటిని తాగడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. అలాగని వీటిని మరీ ఎక్కువగా తీసుకోకూడదు. అందువల్ల రోగికి జీర్ణ, కాలేయ సంబంధిత సమస్యలు పెరుగుతాయని వైద్యులు అంటున్నారు.

ఎంత మోతాదులో తీసుకోవాలి..?

తలనొప్పి, జ్వరంతో బాధ పడుతున్న వారు ఎవరైనా సరే ముందు రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. డెంగ్యూ యాంటిజెన్ పరీక్ష పాజిటివ్‌ అని వస్తే అది డెంగ్యూ జ్వరం అని అర్థం. తర్వాత వైద్యుని సిఫార్సు ప్రకారం.. మందుల కోర్సులు వాడుకోవాలి. మందులు వాడుతూ మాత్రమే బొప్పాయి ఆకుల రసం, కొబ్బరి నీళ్లను తాగాలి. పెద్దలైతే భోజనానికి ముందు 30 మిల్లీ లీటర్లు, పిల్లలైతే ఐదు నుంచి పది మిల్లీ లీటర్ల బొప్పాయి ఆకుల రసాన్ని రోజుకు మూడు సార్లు చొప్పున తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ వద్దు. అదే కొబ్బరి నీళ్లను పూటకు ఒక గ్లాసు చొప్పున తాగవచ్చు. ఈ విషయాలను తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news