చలికాలం లో బయట వాతావరణం చల్లబడటంతో పాటు మన కడుపులో ఆకలి మంట కూడా కాస్త ఎక్కువే అవుతుంది. వేడివేడి బజ్జీలు, సమోసాలు లేదా కప్పు కాఫీ తాగాలని మనసు బలంగా కోరుకుంటుంది. అసలు చలికి, ఆకలికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఇది కేవలం మన భ్రమనా లేక దీని వెనుక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా అంటే.. ఖచ్చితంగా ఉంది అని చెప్పచ్చు. మన శరీరం తనను తాను వెచ్చగా ఉంచుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ పెరిగిన ఆకలికి ప్రధాన కారణం.
శరీర ఉష్ణోగ్రత మరియు జీవక్రియల మాయ: బయట ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు, మన శరీరం తన సాధారణ ఉష్ణోగ్రతను (దాదాపు 37°C) కాపాడుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. ఈ ప్రక్రియలో శరీరం ఎక్కువ శక్తిని (Energy) ఖర్చు చేస్తుంది. దీనినే ‘థర్మోజెనిసిస్’ అంటారు. అంటే శరీరం లోపల వేడిని పుట్టించడానికి ఇంధనం అవసరం ఆ ఇంధనమే మనం తినే ఆహారం.
అందుకే చలి పెరిగే కొద్దీ మన మెదడు శక్తి అవసరమని సంకేతాలు పంపిస్తుంది, ఫలితంగా మనకు ఆకలి ఎక్కువగా వేస్తుంది. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ఉన్న ఆహారం తిన్నప్పుడు శరీరం త్వరగా వేడిని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఆ సమయంలో జంక్ ఫుడ్ లేదా భారీ భోజనంపై మనసు మళ్లుతుంది.

వేడి ఆహారంపై మక్కువకు : చలికాలంలో చల్లటి పదార్థాల కంటే వేడివేడి వంటకాలే ఎందుకు అమృతంలా అనిపిస్తాయి? దీనికి కారణం మన శరీరం కేవలం క్యాలరీలనే కాకుండా తక్షణ ఉపశమనాన్ని ఇచ్చే వెచ్చదనాన్ని కూడా కోరుకుంటుంది. వేడి ఆహారం తీసుకోవడం వల్ల మన అంతర్గత ఉష్ణోగ్రత పెరిగి, శరీరానికి ఒక రకమైన హాయి కలుగుతుంది.
అంతేకాకుండా, చలికాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల మన శరీరంలో ‘సెరోటోనిన్’ అనే హ్యాపీ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి. మరి ఈ లోటును పూడ్చుకోవడానికి, మానసిక సంతృప్తి కోసం మనం తరచుగా ఏదో ఒకటి తినాలని ఆరాటపడుతుంటాం.
చలికాలంలో ఆకలి పెరగడం సహజమే అయినా, నోటికి నచ్చినవన్నీ తినేస్తే బరువు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే వేడివేడి సూప్‌లు, హెర్బల్ టీలు, డ్రై ఫ్రూట్స్ వంటి ఆరోగ్యకరమైన ఎంపికలు చేసుకోవడం ఉత్తమం. శరీరానికి అవసరమైన వెచ్చదనాన్ని ఇచ్చే పప్పు ధాన్యాలు, బజ్రా, రాగులు వంటి ఆహారాన్ని డైట్లో చేర్చుకోవడం వల్ల ఆకలి తీరడమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన మాత్రమే, చలికాలంలో దాహం తక్కువగా వేస్తుంది కానీ శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండటానికి తగినంత నీరు తాగడం మర్చిపోకండి.
