ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలు మండుతున్న ఎండలకు అల్లాడిపోతున్నారు. దీంతో చల్లని మార్గాల వైపు పరుగులు తీస్తున్నారు. శీతల పానీయాలను ఎక్కువగా తాగుతున్నారు. అయితే మద్యం ప్రియులు మాత్రం బీర్‌కే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. మండుతున్న ఎండల్లో చల్ల చల్లగా బీర్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత నెల రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బీర్లకు కొరత ఏర్పడుతుందని ఎక్సైజ్ శాఖ చెబుతోంది. అయితే చల్ల చల్లని బీర్ తాగడం వరకు ఫర్వాలేదు. కానీ అదే బీర్ శృతి మించితేనే ప్రమాదం. ఈ క్రమంలోనే అధికంగా బీర్లను తాగడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1,. చల్ల చల్లగా బీర్ తాగితే శరీరం చల్లగా ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే చల్లదనం కొంత సేపే ఉంటుంది. ఆ తరువాత బీర్‌లో ఉన్న ఆల్కహాల్ మన శరీరంలో వేడిని పుట్టిస్తుంది. దీంతో సహజంగానే ఇతరుల కన్నా బీర్ తాగిన వారికి చెమట ఎక్కువగా పడుతుంది. అలాగే దాహం ఎక్కువ వేస్తుంది. దీంతో అధికంగా నీరు తాగాల్సి వస్తుంది. తాగకపోతే డీహైడ్రేషన్ బారిన పడి ఎండ దెబ్బకు లోనవుతారు. అలాగే కిడ్నీలపై భారం అధికంగా పడుతుంది. కనుక బీర్లను లిమిట్‌లో తాగితే మంచిది.
2. బీర్లను అధికంగా తాగడం వల్ల అందులో ఉండే గ్యాస్ కడుపులో అసిడిటీని కలిగిస్తుంది. దీంతో కడుపులో మంట వస్తుంది. జీర్ణాశయం, పేగుల్లో అలజడి మొదలై అల్సర్లకు దారి తీస్తుంది. కొందరికి కడుపులో పుండ్లు కూడా ఏర్పడుతాయి. కనుక బీర్లను అధికంగా తాగరాదు.
3. బీర్ సేవించడం వల్ల మన శరీరంలో ఉండే ఏడీహెచ్ అనే హార్మోన్ పనితీరు మందగిస్తుందట. దీంతో ఇతర జీవక్రియలకు ఆటంకం కలుగుతుందని, తిన్న ఆహారం జీర్ణం అవడం, శక్తి లభించడం.. తదితర క్రియలకు ఆటంకం కలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి బీర్లను అధికంగా సేవించరాదు.
4. బీర్లను అధికంగా సేవించడం వల్ల కొందరిలో వేడి ఎక్కువై విరేచనాలు మొదలయ్యే అవకాశం కూడా ఉంటుంది. వేసవిలో విరేచనాలు అయితే అది ప్రాణాంతక స్థితికి దారి తీయవచ్చు. ఈ క్రమంలో శరీరంలో ఉండే ఎలక్ట్రోలైట్లు, ముఖ్యమైన పోషకాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. దీంతో నీరసం, అలసట వస్తాయి. క్రమంగా ఏ పని చేయలేని స్థితికి చేరుకుని స్పృహ కూడా కోల్పోతారు. కనుక బీర్లను అధికంగా సేవించే వారు ఈ సూచనలను ఒక్కసారి గమనించి ముందుకు ప్రొసీడ్ అవ్వాలి. లేదంటే అనవసరంగా అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్న వారవుతారు.