కొత్త వైరస్ కలకలం రేపుతోంది. ఇది ముఖ్యంగా చంటిపిల్లల మీదే ప్రభావం చూపుతున్నట్లు వైద్యులు అంటున్నారు. ఐరోపాలో ఎంట్రోవైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. క్రొయేషియా, ఇటలీ, స్పెయిన్, స్వీడన్, యునైటెడ్ కింగ్‌డమ్, ఉత్తర ఐర్లాండ్ వంటి దేశాల్లో ఎంట్రోవైరస్ ఇన్ఫెక్షన్లు అధికమవుతున్నాయి. వీటి పెరుగుదల చూస్తుంటే ఇతర దేశాలకు త్వరగానే పాకే అవకాశం ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఈ ఎంట్రోవైరస్‌ను ఎదుర్కోవడానికి అమెరికా కూడా సిద్ధపడింది.
నవజాత శిశువులే టార్గెట్
ఐరోపాలో అప్పుడే పుట్టిన పిల్లలపై ఎంట్రో వైరస్ దాడి చేస్తోంది. బ్రిటన్లో ఇప్పటికే 17 మంది పిల్లలు ఈ వైరస్ బారిన పడ్డారు. ఫ్రాన్స్‌లో కూడా తొమ్మిది మంది ఈ ఎంట్రో వైరస్ ఇన్ఫెక్షన్ బారిన పడగా అందులో ఏడుగురు చనిపోయారు. అప్పుడే పుట్టిన చిన్నారులు ఈ ఎంట్రో వైరస్ ఇన్ఫెక్షన్ సోకి కొన్ని రోజులకు మరణిస్తున్నారు. ఇది శిశువుల పైనే ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. శిశువులకు రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఈ వైరస్ వారిపై అధికంగా ప్రభావాన్ని చూపిస్తున్నట్లు వైద్యులు అంటున్నారు.
అమెరికాలో కూడా కలకలం
యూరోప్ దేశాల్లోనే కాదు, అమెరికాలో కూడా పిల్లల్లో ఎంట్రోవైరస్ ఇన్ఫెక్షన్లు కనిపిస్తున్నాయి. ఆ దేశం ఇప్పటికే అప్రమత్తమయింది. ఎంట్రో వైరస్ అనేది పోలియో వైరస్, కాక్స్‌సాకీ వైరస్ వంటి వాటి వల్ల సంభవిస్తుంది. ఇది తేలికపాటి ఇన్ఫెక్షన్ అయినప్పటికీ చంటి బిడ్డల్లో, రోగనిరోధక శక్తి లేని రోగుల్లో ఇది అధిక ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రాణాంతకంగా మారుతుంది.
లక్షణాలు..
చేతులు, పాదాలు, నోటిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. అక్కడి చర్మంపై దద్దుర్లు వస్తాయి.
వైరల్ మెనింజైటిస్ రావచ్చు. ఎర్రటి దద్దుర్లు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.ఇది అంటువ్యాధి, కాబట్టి త్వరగా ఇతర శిశువులకు సోకే అవకాశం ఉంది.సాధారణ వ్యక్తులకు ఈ వైరస్ వస్తే కొన్ని రోజుల్లో తేరుకుంటారు.నవజాత శిశువుల్లో ఈ ఇన్ఫెక్షన్ తీవ్రంగా మారుతుంది. వారి వ్యాధినిరోధక వ్యవస్థ చాలా బలహీనంగా మారుతుంది.అందుకే ఈ ఇన్ఫెక్షన్ బారి నుండి బిడ్డలను కాపాడుకోవాలి.
ఇండియాలో కూడా ఉందా..?
కేరళ, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, అసోం, అండమాన్ దీవులలో ఎంట్రో వైరస్ వ్యాప్తి ఉండవచ్చని తెలుస్తోంది. కేరళలో గత ఏడాది టమోటో ఫ్లూ విపరీతంగా వ్యాపించింది. ఈ టమోటో ఫ్లూ వచ్చిన వారిలో చర్మంపై ఎర్రటి బొబ్బలు వచ్చాయి. ఎంట్రో వైరస్ కూడా చర్మంపై దద్దుర్లతోనే కనిపిస్తుంది. కాబట్టి దద్దుర్లు కనిపిస్తే తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తవ్వాలి. మాటలు కూడా రాని వయసులో ఇలాంటి వైరస్‌లు వారి ప్రాణాలన్నే తీస్తున్నాయి. చిన్నపిల్లల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి.