ఒత్తిడిని జయించడానికి 4 వీక్స్ ప్లాన్.. మీరూ ట్రై చేయండి..

ఈరోజుల్లో స్కూల్ కి వెళ్లే పిల్లల నుంచి కాటికి కాలు చాపిన వృద్ధుల వరకు అందరూ ఒత్తిడి సమస్యతో బాధపడుతున్నారు. హోంవర్క్ చేయాలని పిల్లలు, బాస్ ఇచ్చిన డెడ్ లైన్ కి వర్క్ కంప్లీట్ చేయాలని పెద్దలు ఇలా రకరకాల కారణాలతో అందరు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ప్రపంచమంతా ఒత్తిడికి గురవుతోందని తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. ప్రపంచంలో 80 శాతం మంది పని ఒత్తిడికి కుంగిపోతున్నారని.. అందులో సగానికి కంటే ఎక్కువ ఈ స్ట్రెస్ ని జయించే మార్గాలను వెతుకుతున్నారని ఆ సర్వేలో తేలింది. ఈ ఒత్తిడిని మొదట్లోనే జయించకపోతే తర్వాత ఆరోగ్య సమస్యలతో పాటు డిప్రెషన్ కి గురై ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదముందని డాక్టర్లు చెబుతున్నారు. స్ట్రెస్ ని జయించడానికి కొన్ని మార్గాలు చెప్పారు. అదే ఈ 4 వారాల సెషన్. అదేంటో తెలుసుకుందామా..?

ఒత్తిడిని జయించడానికి షార్ట్ కట్ ఏం లేదు. అలా అని అదో లాంగ్ ప్రాసెస్ కూడా కాదు. కానీ స్టెప్ బై స్టెప్ ప్రయత్నిస్తే ఒత్తిడిని జయించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. దీనికోసమే వారు 4 వీక్స్ ప్లాన్ ను సజెస్ట్ చేస్తున్నారు. ఇందులో మొదటి వారంలో ఏం చేయాలంటే రాత్రి సమయంలో మీ ఫోన్లని పక్కన పెట్టేయడమే ! గ్యాడ్జెట్ల నుంచి కొద్దిసేపైనా మనకి మనం కాస్త విరామాన్ని ప్రకటించుకోవడమే ఫస్ట్ స్టెప్ లో మనం చేయాల్సిన పని. అందుకే డిజిటల్ ప్రపంచానికి విరామాన్ని ప్రకటిస్తూ రాత్రి 8 నుండి ఉదయం లేచే వరకు ఫోన్, ఇతర గ్యాడ్జెట్లకు రెస్ట్ ఇవ్వమంటున్నారు వైద్యులు.

ఇది నెమ్మదిగా అలవాటయ్యాక ఈ వారంలోనే చేయాల్సిన మరో పనేంటంటే..ఓ లిస్ట్ తయారు చేసుకోండి. అదేంటంటే.. మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏం చేస్తున్నారో ఓ నోట్ రాసుకోండి. అందులో మీకు నచ్చని విషయాలేంటో గుర్తించండి. దీనిద్వారా మీరు ఏ పని విషయంలో ఒత్తిడికి గురవుతున్నారో తెలుస్తుంది. రోగం తెలిస్తే మందు కనిపెట్టడం కాస్త ఈజీయేగా. ఇక చివరగా పాటించాల్సింది సుఖమైన నిద్ర. చాలా సమస్యలు మంచి నిద్రవల్లే నయమవుతాయని డాక్టర్లు చెబుతుంటారు. అందుకే నిద్ర విషయంలో కాస్త స్ట్రిక్ట్ గా ఉండి రోజుకు 8 గంటలు తప్పకుండా నిద్రపోయేలా ప్లాన్ చేసుకోమని సూచిస్తున్నారు.

మొదటివారంలో నిద్ర విషయంలో కాస్త డిసిప్లిన్ అలవడ్డాక.. రెండో వారంలో ఫోకస్ చేయాల్సింది ఫుడ్ డైట్ పైన. ఒత్తిడిలో కొందరు ఎక్కువగా తినేస్తుంటారు. దీనివల్ల ఊబకాయం బారిన పడే అవకాశముంది. అందుకే సాధ్యమైనంత వరకు హెవీ ఫుడ్, బిర్యానీ, స్వీట్లు, ఇతరత్రా జంక్ ఫుడ్ తినొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. ఒత్తిడిలో మీకు బాగా తినాలి అనిపిస్తే వెంటనే ఫస్ట్ స్టప్ కి వెళ్లండి. అదేనండి కాసేపు హాయిగా నిద్రపోండి. అలాగే రోజులో ఒకేసారి ఎక్కువ కాకుండా.. తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తినేలా డైట్ ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

నిద్ర, డైట్ సెట్ అయ్యాక మూడో వారంలో మనం ఫోకస్ చేయాల్సింది ధ్యానం. అన్ని రోగాలను నయం చేసే ఔషధం. ఎక్కడైనా ప్రశాంతంగా నిల్చుని లేక కూర్చుని నడుముని నిటారుగా ఉంచాలి. గాలి పీలుస్తూ అయిదంకెలు లెక్కపెట్టాలి.ఇప్పుడు పది సెకండ్ల పాటు ఊపిరిని నిలపాలి.ఆ తర్వాత ఎనిమిదంకెలను లెక్కపెడుతూ గాలిని బయటకు వదలాలి. ఇలా పలుమార్లు రిపీట్ చేయాలి. ధ్యానంతో పాటు ఈ వారంలో నేర్చుకోవాల్సింది ‘నో’ చెప్పడం. తలకి మించిన భారం నెత్తినేసుకోవడం కూడా ఒత్తిడికి ఒక కారణమే. ఇష్టం లేకపోయినా మొహమాటంతో ఇతరులు చేయాల్సిన పనిని తమ భుజాలపై వేసుకుంటుంటారు చాలామంది. దీనివల్ల మీరు చేయాల్సిన ఇతర పనులపై ప్రభావం పడుతుంది. అప్పుడు మీకు తెలియకుండానే మీలో ఒత్తిడి ప్రవేశిస్తుంది. అందుకే అటువంటి సందర్భాల్లో ‘నో’ చెప్పడం అలవాటు చేసుకోవాలంటున్నారు వైద్యులు.

మూడు వారాల్లో మీలో కొంచెం మార్పు రావడం గమనిస్తారు. ఇక ఆఖరి వారంలో అదేనండీ నాలుగో వారంలో మీ మెంటల్ హెల్త్ పై ఫోకస్ చేయాలి. మీలో మీరు గమనించిన పాజిటివ్ విషయాలను నోట్ చేసుకోవాలి. అలాగే మీ తప్పులనూ గమనించాలి. వాటిని సవరించుకునే మార్గాలను అన్వేషించాలి. ఇలా ఆలోచనలు ఆచరణలోకి మారి అలవాట్లుగా మారినప్పుడే మీపై మీరు విజయం సాధిస్తారు. మీరు ఒత్తిడికి గురైతే ఈ 4 వీక్స్ ప్లాన్ ట్రై చేయండి.. హ్యాపీగా జాలీగా లైఫ్ ఎంజాయ్ చేయండి.