వ్యాయామం చేశాక శరీరంపై ఉన్న చెమట, దుమ్ము, బ్యాక్టీరియాని వదిలించుకోవడానికి స్నానం చేయడం చాలా ముఖ్యం. ఇది చర్మం ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. కానీ, జిమ్ నుంచి వచ్చీ రాగానే చల్లటి నీళ్లతో స్నానం చేయడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని చాలామంది చెబుతుంటారు. నిజానికి జిమ్ తర్వాత స్నానం చేయడం హానికరం కాదు, కానీ సరైన సమయం మరియు పద్ధతిని పాటించడం అత్యవసరం. మరి మనం జిమ్ తర్వాత స్నానం చేయడానికి సరైన సమయం పద్ధతి గురించి తెలుసుకుందాం.
జిమ్ తర్వాత శరీరం సహజంగా వేడిగా ఉంటుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది రక్తప్రసరణ కూడా పెరుగుతుంది. ఈ సమయంలో చల్లటి నీళ్లతో వెంటనే స్నానం చేయడం వల్ల శరీరం షాక్‌కి గురయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల రక్తనాళాలు ఒక్కసారిగా సంకోచించి, రక్తపోటులో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. అరుదుగా దీనివల్ల కండరాల పట్టేయడం (muscle cramps) తల తిరగడం వంటి సమస్యలు కూడా ఎదురవ్వచ్చు.

అయితే జిమ్ తర్వాత చెమటతో కూడిన దుస్తులను అలాగే ఉంచుకోవడం మరింత హానికరం. దీనివల్ల చర్మంపై దద్దుర్లు, దురద ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అందుకే వ్యాయామం ముగిసిన వెంటనే స్నానం చేయడం సురక్షితం కానప్పటికీ కాసేపు ఆగి స్నానం చేయాలి. వ్యాయామం తర్వాత సుమారు 15-20 నిమిషాలు విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈ సమయంలో మీ శరీరం సాధారణ స్థితికి వస్తుంది. గుండె వేగం తగ్గుతుంది చెమట పట్టడం కూడా ఆగిపోతుంది.
ముందుగా గోరువెచ్చని నీటితో స్నానం ప్రారంభించండి. ఇది కండరాలకు విశ్రాంతినిచ్చి, వాటి నొప్పిని తగ్గిస్తుంది. ఆ తర్వాత క్రమంగా నీటి ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చు. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల కండరాల వాపు తగ్గుతుంది. ఈ విధంగా స్నానం చేయడం వల్ల మీ చర్మం శుభ్రపడటమే కాకుండా కండరాలకు ఉపశమనం లభిస్తుంది. అలాగే జిమ్ తర్వాత స్నానం చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.
జిమ్ తర్వాత స్నానం చేయడం ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. అయితే వ్యాయామం ముగిసిన వెంటనే స్నానం చేయకుండా, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ద్వారా హానికలిగే అవకాశాలను తగ్గించుకోవచ్చు. ఈ సరైన పద్ధతిని పాటించడం వల్ల మీరు పూర్తి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.