ఆరోగ్యానికి ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే, వాటిలో ఎన్నో పోషకాలు, ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేయటమే కాక శక్తిని ఇస్తాయి. అయితే వర్షాకాలం సమీపిస్తున్నప్పుడు ఆకుకూరలు తినడం గురించి చాలామంది సందేహ పడుతుంటారు. వర్షాకాలంలో ఆకుకూరల వాడకం గురించి, నిపుణులు తెలిపిన సలహాలను మనము చూద్దాం..
వర్షాకాలంలో ఆకుకూరలు ఎందుకు ప్రమాదం: ప్రతి ఇంట్లో వర్షాకాలం రాగానే ఆకుకూరలు వండొద్దని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ కాలంలో ఆకుకూరలు తినడం వలన విరోచనాలు, వాంతులు, వంటి సమస్యలకు గురి అవుతామని హెచ్చరిస్తారు. దీనికి ఒక కారణం ఉంది వర్షాకాలంలో తేమ, మట్టి కలుషితనీరు వల్ల ఆకుకూరలు భూమి నుండి పెరిగేటప్పుడు బ్యాక్టీరియా ఫంగస్ క్రిములు , లాంటివి చేరతాయి. ఈ ఆకుకూరలు తేమను ఆకర్షించే ఆకులను కలిగి ఉంటాయి. అందువల్లే ఎక్కువ సూక్ష్మ క్రిములు ఆకుకూరల్లో చేరతాయి. సూర్యరశ్మి లేకపోవడం వల్ల మట్టిలో సహజంగా జరిగే క్రిమిసంహార ప్రక్రియ తగ్గుతుంది ఫలితంగా ఇవి కలుషితం అయ్యే అవకాశం పెరుగుతుంది. ఈ కారణంగానే ఆకుకూరలు, పచ్చిగా తింటే కడుపు నొప్పి, ఇన్ఫెక్షన్, డయేరియా, ఫుడ్ పాయిజన్ కు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిపుణుల సలహా: చాలామంది నిపుణులు వర్షాకాలంలో ఆకుకూరలు పూర్తిగా నివారించవద్దని చెబుతున్నారు. ఎందుకంటే ఆకుకూరల్లో ఎన్నో పోషకాలు, ఐరన్, జింక్, ఫోలిక్ యాసిడ్ వంటివి అధికంగా ఉంటాయి. వీటి వలన రక్తం వృద్ధి చెందుతుంది. పీచు పదార్థం ఉండడం వల్ల మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. అలాగే ఆకుకూరల్లో విటమిన్ ఏ, సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మెగ్నీషియం పొటాషియం కాల్షియం, సోడియం, వంటి ఎన్నో పోషకాలు ఆకుకూరలలో ఉంటాయని నిపుణులు తెలుపుతున్నారు. అందుకే వారంలో కనీసం రెండు లేక మూడు రోజులు ఆకుకూరలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
ఎలా తింటే మంచిది: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు అధికంగా కనిపిస్తాయి. మరి వాటి నుంచి రక్షణ పొందడానికి శరీరానికి కావలసిన క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటివి ఆకుకూరల నుంచే లభిస్తాయి. అందుకే రోజు వారి ఆహారంలో 50 గ్రాములు చొప్పున ఏదో ఒక ఆకుకూరని తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే వీటిని తినే ముందు ఉప్పు లేదా వెనిగర్ కలిపిన నీటిలో బాగా కడగాలి. ఆ తర్వాత ఎక్కువసేపు వీటిని ఉడికించాలి. ఇలా ఉడికించడం వల్ల అందులో ఉండే క్రిములు నశిస్తాయి. ఈ కాలంలో పచ్చి ఆకుకూరలు తినడం అంత మంచిది కాదు. అందుకే వాటిని కడిగి ఉడికించి తినడం శ్రేయస్కరం.
(పైన అందించిన ఆరోగ్య సమాచారం సూచనలు అన్ని అవగాహన కోసం మాత్రమే, వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.)