అధిక బరువు తగ్గేందుకు చాలా మంది అనేక రకాల పద్ధతులు పాటిస్తుంటారు. కొందరు సర్జరీల వైపు పరుగులు తీస్తే కొందరు వ్యాయామం లేదా యోగా చేసి బరువు తగ్గించుకోవాలని చూస్తుంటారు. అయితే బరువు తగ్గేందుకు వ్యాయామమే కాదు, సరైన ఆహారాన్ని టైముకు తీసుకోవడం కూడా అవసరమే. ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తన నిత్య జీవితంలో యోగా చేయడంతోపాటు ఓ కచ్చితమైన డైట్ ప్రణాళికను పాటించి.. 32 కిలోల వరకు బరువు తగ్గింది. ప్రెగ్నెన్సీతో ఆమె బరువు బాగా పెరగ్గా.. ఆ తరువాత డైట్ పాటించి అంత మొత్తంలో బరువు తగ్గింది. మరి బరువు తగ్గేందుకు శిల్పాశెట్టి పాటించిన డైట్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఉదయం…
* ఉదయాన్నే పరగడుపునే 15 ఎంఎల్ అలోవెరా జ్యూస్‌లో 10 తులసి ఆకులు, కొద్దిగా బెల్లం, అల్లం రసం కలుపుకుని తాగాలి. ఆ తరువాత 2 గ్లాసుల గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి.
* బ్రేక్‌ఫాస్ట్‌లో తృణ ధాన్యాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఓట్స్ లేదా ఓట్‌మీల్, పాలు, రెండు కోడిగుడ్లు (పచ్చ సొనతో సహా) తీసుకోవాలి. ఒక గంట గ్యాప్ ఇచ్చి ఒక కప్పు టీ (పాలు, బెల్లం కలిపినది) తాగాలి.
* బ్రేక్‌ఫాస్ట్ చేశాక రెండు గంటలకు ఒక కప్పు బొప్పాయి లేదా తర్బూజ ముక్కలు, ఆపిల్ లేదా స్ట్రాబెర్రీలు వేసి తయారు చేసిన యోగర్ట్ స్మూతీ తీసుకోవాలి.
మధ్యాహ్నం…
* ఒక కప్పు బ్రౌన్ రైస్, ఒక టీస్పూన్ నెయ్యి, కూరగాయాలు లేదా గ్రిల్డ్ చికెన్ లేదా ఫిష్ తీసుకోవాలి.
* క్యారెట్లు, బీన్స్ వేసి కూర చేసుకుని తినవచ్చు. తీపి తినాలనిపిస్తే బెల్లం లేదా పల్లీలు, బెల్లం వేసి తయారు చేసిన తీపి పదార్థాలను తినాలి.
* స్నాక్స్ సమయంలో 8 నుంచి 10 రోస్ట్ చేసిన మఖానాలు లేదా 5 వాల్‌నట్స్ లేదా 5 కిస్మిస్‌లు, లేదా రెండు కోడిగుడ్లు తీసుకోవాలి.
రాత్రి…
డిన్నర్‌లో వెజిటబుల్ సూప్ (గుమ్మడికాయలు, టమాటాలు, ఆకు కూరలు వేసినది) తాగాలి. లేదా చికెన్ సూప్, మొలకెత్తిన గింజలు తీసుకోవచ్చు. అలాగే పప్పు లేదా పన్నీర్ లేదా గ్రిల్డ్ చికెన్, ఫిష్ తీసుకోవచ్చు. వెజిటేరియన్స్ అయితే బీన్స్, బ్రకోలి, పుట్ట గొడుగులు తినాలి.