ఈ రోజుల్లో పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించుకోవడానికి లేదా ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం ఉంటే పీరియడ్స్‌ను వాయిదా వేయడానికి చాలామంది మహిళలు టాబ్లెట్స్ వాడుతున్నారు. కొందరు ఇంజెక్షన్స్ ను తీసుకుంటున్నారు. పీరియడ్స్ టాబ్లెట్స్ అనేవి ఒకప్పుడు అరుదుగా వాడేవారు కానీ ఇప్పుడు అవి సాధారణమైపోయాయి. ఈ టాబ్లెట్స్ ఎంత సౌకర్యాన్ని ఇస్తాయో, అవి అంత ప్రమాదకరమని చాలామందికి తెలియదు. ఈ అలవాటు మన శరీరానికి ఎంత హానికరం, దాని వల్ల ఏయే సమస్యలు వస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
పీరియడ్స్ టాబ్లెట్స్, ముఖ్యంగా హార్మోన్ల ఆధారిత టాబ్లెట్స్ దీర్ఘకాలంలో శరీరానికి హాని చేస్తాయి. పీరియడ్స్ వాయిదా వేసే టాబ్లెట్స్‌లో హార్మోన్లు (ప్రొజెస్టెరాన్) అధికంగా ఉంటాయి. ఇవి శరీరం సహజంగా చేసే హార్మోన్ల ప్రక్రియను అడ్డుకుంటాయి.

ఈ టాబ్లెట్స్ వాడటం వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది భవిష్యత్తులో క్రమరహిత పీరియడ్స్‌కు, సంతానలేమికి కారణం కావచ్చు. హార్మోన్లలో మార్పులు మానసిక ఒత్తిడిని, ఆందోళనను పెంచగలవు. ఇది మూడ్ స్వింగ్స్కు, డిప్రెషన్‌కు దారితీయవచ్చు. కొన్నిసార్లు ఈ టాబ్లెట్స్ వాంతులు, వికారం, కడుపునొప్పి, మరియు ఇతర జీర్ణ సంబంధ సమస్యలను కలిగిస్తాయి.
పీరియడ్స్ వాయిదా వేసిన తర్వాత వచ్చే రక్తస్రావం ఎక్కువ కావచ్చు లేదా ఊహించని సమయంలో స్పాటింగ్ (చిన్నగా రక్తస్రావం) కావచ్చు.చాలా అరుదుగా, హార్మోన్ల టాబ్లెట్స్ రక్తం గడ్డ కట్టే ప్రమాదాన్ని పెంచుతాయి. ఇది ప్రాణాంతకం కావచ్చు.దీర్ఘకాలంగా ఈ టాబ్లెట్స్ వాడడం వల్ల అండం ఉత్పత్తిలో సమస్యలు వస్తాయి.
సౌకర్యం కోసం వాడే పీరియడ్స్ టాబ్లెట్స్ వాడటం వల్ల దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే డాక్టర్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు మాత్రమే ఈ టాబ్లెట్స్ వాడాలి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం