ఎండాకాలంలో మన శరీరం సహజంగానే డీహైడ్రేషన్‌కు గురవుతుంటుంది. మామూలు సమయాల్లో కన్నా వేసవిలోనే మనం నీటిని ఎక్కువగా తాగాలి. ఇక డయాబెటిస్ ఉన్నవారికి వేసవిలో ఇంకా ఎక్కువ దాహం వేస్తుంది. దీంతో వారు నీటిని తాగే ఫ్రీక్వెన్సీని పెంచాలి. ఈ క్రమంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. అయితే వేసవిలో నీరే కాదు.. మజ్జిగను కూడా ప్రతి ఒక్కరూ కచ్చితంగా తాగాల్సిందే. దాంతో అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటంటే..
* ఎండ దెబ్బకు గురైన వారికి నీటి కన్నా మజ్జిగను తాగిస్తేనే మంచిది. వారి శరీరం కోల్పోయిన ద్రవాలతోపాటు మినరల్స్, ఎలక్ట్రోలైట్స్‌ను త్వరగా శోషించుకుని మళ్లీ ఉత్తేజంగా మారేందుకు అవకాశం ఉంటుంది. కనుక వారికి మజ్జిగను తప్పకుండా తాగించాలి.
* ఎండలో బయట తిరిగి వచ్చేవారు మజ్జిగ తప్పనిసరిగా తాగాలి. దీంతో శరీరంలో ఉండే వేడి బయటకు వెళ్లిపోతుంది. ఆయుర్వేద ప్రకారం.. మజ్జిగ మన శరీరానికి చలువ చేస్తుంది. అందుకని నిత్యం మనం మజ్జిగను తాగాలి. దీంతో శరీరం చల్లగా ఉంటుంది.
* పిల్లల్లో వేసవిలో వచ్చే అధిక వేడి సమస్యకు మజ్జిగతో చెక్ పెట్టవచ్చు. వారు సహజంగానే పెద్దలు చెబితే వినరు. నీళ్లు ఎక్కువగా తాగరు. కనుక మజ్జిగను తాగిస్తే ఎండ దెబ్బకు గురవకుండా చూసుకోవచ్చు. దీంతోపాటు అధిక వేడి ఏర్పడకుండా ఉంటుంది.
* మజ్జిగలో అల్లం, ఉప్పు, కొద్దిగా పటికబెల్లం కలిపి తాగితే ఎంత వేడి అయినా ఇట్టే తగ్గుతుంది.
* వేసవికాలం రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు మజ్జిగలో ఉల్లిపాయ పేస్టు కొద్దిగా కలుపుకుని తాగితే చలువ చేస్తుంది. నిద్ర కూడా చక్కగా పడుతుంది.
* మజ్జిగలో కొద్దిగా ఇంగువ, జీలకర్ర, సైంధవ లవణం కలిపి తీసుకుంటే.. వేసవిలో ఎదురయ్యే గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
* మజ్జిగలో నిమ్మరసం కలిపి తీసుకుంటే నీరసం రాకుండా ఉంటుంది. ఉత్తేజంగా ఉంటారు.
* మజ్జిగలో కరివేపాకు కలిపి తీసుకోవడం వల్ల చలువ చేస్తుంది. అంతేకాదు, రక్తం వృద్ది చెందుతుంది. కంటి చూపు పెరుగుతుంది.
* ఎండవల్ల చర్మం పొడిబారిపోవడం సహజం. అలాంటి వారు మజ్జిగను తాగుతుంటే చర్మం మళ్లీ పూర్వ రూపాన్ని సంతరించుకుంటుంది.