నేటి ఆధునిక జీవనశైలిలో, థైరాయిడ్ సమస్య చాలా సాధారణమైపోయింది. ఇది ఒక చిన్న గ్రంథి అయినా మన శరీరంలో జరిగే అనేక జీవక్రియలను నియంత్రిస్తుంది. థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత వల్ల మన శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులు తరచుగా గోళ్లు, జుట్టు, చర్మంపై స్పష్టంగా కనిపిస్తాయి. అయితే ఈ మార్పులు సాధారణమైనవా లేదా థైరాయిడ్ సమస్యకు సంకేతాలా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. మరి మనం ఆ సమస్యలు వివరంగా తెలుసుకుందాం..
మన శరీరంలో కనిపించే చిన్నపాటి మార్పులు కూడా కొన్నిసార్లు పెద్ద ఆరోగ్య సమస్యలకు సూచన కావచ్చు. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిలో లోపం ఉంటే, చర్మం, జుట్టు, గోళ్లలో మార్పులు కనబడతాయి.
జుట్టులో మార్పులు: థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు (హైపోథైరాయిడిజం) జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. జుట్టు పలుచబడి, పొడిగా మారుతుంది. తల వెంట్రుకలే కాకుండా కనుబొమ్మల చివర జుట్టు కూడా పలచబడవచ్చు. థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు (హైపర్‌థైరాయిడిజం) జుట్టు సన్నబడి సున్నితంగా మారే అవకాశం ఉంటుంది.

చర్మంలో మార్పులు: హైపోథైరాయిడిజం ఉన్నవారిలో చర్మం పొడిగా, గరుకుగా మారుతుంది. చర్మం రంగు పాలిపోయినట్లుగా కనిపిస్తుంది. అలాగే చర్మం చల్లగా ఉండవచ్చు. హైపర్‌థైరాయిడిజంలో చర్మం మృదువుగా వెచ్చగా ఎక్కువగా చెమట పట్టేలా ఉంటుంది.
గోళ్లలో మార్పులు: థైరాయిడ్ సమస్య ఉంటే గోళ్లు సున్నితంగా మారి, పగిలిపోవచ్చు. గోళ్లపై పగుళ్లు తెల్లటి గీతలు ఏర్పడవచ్చు. గోళ్లు సాధారణంగా కంటే నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంది. హైపర్‌థైరాయిడిజంలో గోళ్లు పెళుసుగా మారవచ్చు. ఈ మార్పులు థైరాయిడ్ సమస్యకు సూచనలు మాత్రమే. ఎందుకంటే వీటిలో కొన్ని మార్పులు వాతావరణం పోషకాహార లోపం వంటి ఇతర కారణాల వల్ల కూడా సంభవించవచ్చు.
గోళ్లు, జుట్టు, చర్మంలో మార్పులు కనిపించినప్పుడు అప్రమత్తంగా ఉండటం మంచిది. ఈ లక్షణాలు ఒకేసారి కనిపించినట్లయితే అది థైరాయిడ్ సమస్యకు సూచన కావచ్చు. ఈ మార్పులను నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి సరైన నిర్ధారణ చేసుకోవడం అవసరం.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే స్వయంగా చికిత్స చేసుకోకూడదు. సరైన నిర్ధారణ కోసం వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి.