పూర్తి ఆరోగ్యం బాగుండాలంటే తప్పకుండా ఎన్నో జాగ్రత్తలను పాటించాలి. ముఖ్యంగా రోజు వారి ఆహారంలో భాగంగా తీసుకునేటువంటి ఆహార పదార్థాల పై ఎంతో శ్రద్ధ వహించాలి. వంటలలో ఉపయోగించే నూనెను కూడా సరిగ్గా ఎంపిక చేసుకుని తక్కువ మోతాదులో ఉపయోగించాలి. ఎప్పుడైతే నూనెను ఎక్కువగా ఉపయోగిస్తారో ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతిరోజు వంటలో నూనెను ఉపయోగించడం సహజమే. కాకపోతే, తరచుగా కొన్ని వంటలలో ఎక్కువ మోతాదును ఉపయోగిస్తే ఆరోగ్యం పై ప్రభావం ఉంటుంది. నూనెలో ఎన్నో మంచి పోషక విలువలు ఉన్నా సరే, వాటి వలన వచ్చే నష్టాలు కూడా ఉంటాయి. కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
నూనె కు బదులుగా నెయ్యిని ఎక్కువగా తీసుకోవచ్చు. నెయ్యిలో ఉండేటువంటి బ్యూటిరేట్, సి ఎల్ ఏ వంటి పదార్థాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. నెయ్యిలో ఉండే సిఎల్ఎ కొవ్వును కాల్చడానికి సహాయం చేస్తుంది. వంటలలో కొబ్బరి నూనెను ఉపయోగించడం వలన మరింత ఉపయోగం ఉంటుంది. దీనిలో ఉండే లారిక్ యాసిడ్, మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ వంటి పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మంచి ఆరోగ్యానికి ఆవనూనె కూడా ఎంతో సహాయం చేస్తుంది. వీటిలో ఉండే పోషకాల వలన అధిక ఉష్ణోగ్రతలలో కూడా పదార్థాలను తయారు చేసుకోవచ్చు.
పైగా ఆరోగ్యం పై ఎటువంటి ప్రమాదం ఉండదు. వంటలలో ఆలివ్ ఆయిల్ ను కూడా ఎక్కువగా ఉపయోగించవచ్చు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పైగా, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది. కాకపోతే అధిక ఉష్ణోగ్రతలలో వంట తయారు చేయడానికి ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించకూడదు. కేవలం సలాడ్స్ వంటి వాటిలో మాత్రమే ఉపయోగించవచ్చు. కాకపోతే ఎలాంటి నూనె అయినా సరైన మోతాదులో ఉపయోగించాలి. ముఖ్యంగా డీప్ ఫ్రై వంటి వాటిలో నూనె వినియోగాన్ని తగ్గించుకోవాలి. దానికి బదులుగా గ్రిల్ చేయడం, ఉడికించడం వంటివి పాటించాలి. ఇలా చేయడం వలన నూనె ఉపయోగం తగ్గుతుంది మరియు ఆరోగ్యంగా ఉండవచ్చు.