మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం సమయానికి తగిన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడంతోపాటు నిత్యం తగినన్ని గంటల పాటు నిద్రించాలి. అలాగే నిత్యం వ్యాయామం కూడా చేయాలి. కానీ కొందరు అసలు వ్యాయామం చేసేందుకు బద్దకిస్తుంటారు. నిజానికి అలాంటి జీవనశైలి కలిగి ఉండడం ప్రమాదకరం. దాని వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. అసలు వ్యాయాయమే చేయకపోతే మనకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయో ఇప్పుడు చూద్దాం.
* నిత్యం వ్యాయామం చేస్తే రాత్రి టైముకు నిద్రపడుతుంది. అదే వ్యాయామం చేయకపోతే నిద్రలేమి సమస్య వస్తుంది. దీంతో రాత్రిళ్లు చాలా ఆలస్యంగా నిద్రపోవాల్సి వస్తుంది. ఫలితంగా అనారోగ్య సమస్యల బారిన పడతారు.
* నిత్యం వ్యాయామం చేయకపోతే జ్ఞాపకశక్తి తగ్గుతుందని, ఏకాగ్రత నశిస్తుందని పలువురు సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది.
* రోజూ వ్యాయామం చేయకపోతే దీర్ఘకాలంలో శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రణ కోల్పోతాయి. ఫలితంగా డయాబెటిస్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
* వ్యాయామం చేయడం వల్ల ఎముకలు, కీళ్లు దృఢంగా మారుతాయి. కానీ వ్యాయామం చేయకపోతే ఆయా భాగాలు బలహీనంగా మారుతాయి. నొప్పులు వస్తాయి. అసలు కదిలేందుకు కూడా శరీరం సహకరించదు.
* రోజూ వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గవచ్చు. కానీ వ్యాయామం చేయకపోతే బరువు పెరుగుతారు.
కనుక నిత్యం కనీసం 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.