వైట్ డిశ్చార్జ్ అనేది మహిళల్లో సహజంగా కనిపించే ఒక శారీరక ప్రక్రియ. ఇది గర్భాశయం, యోనిని శుభ్రం చేయడానికి ఇన్ఫెక్షన్లను నివారించడానికి సహాయపడుతుంది. అయితే కొన్నిసార్లు ఈ డిశ్చార్జ్ రంగు వాసన లేదా స్థిరత్వంలో మార్పులు వస్తాయి. ఈ మార్పులు ఏదైనా ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. ఈ సమస్యలను సకాలంలో గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. మరి ఈ సమస్యకు గల కారణాలు నివారణ మార్గాల గురించి తెలుసుకుందాం.
వైట్ డిశ్చార్జ్ రంగు వాసన, పరిమాణం మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖాయమైనవి తెలుసుకోవటం ముఖ్యం.
బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు: యోనిలో సహజంగా ఉండే బాక్టీరియా సమతుల్యత దెబ్బతిన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇది దురద, మంట చేప వాసన లాంటి డిశ్చార్జ్కి కారణం అవుతుంది.
ఈస్ట్ ఇన్ఫెక్షన్లు: కాండిడా అనే శిలీంధ్రం వల్ల ఈ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇది తరచుగా మధుమేహం ఉన్నవారిలో యాంటీబయోటిక్స్ వాడేవారిలో కనిపిస్తుంది. దీనివల్ల పాలు విరిగినట్లుగా, తెల్లటి, చిక్కటి డిశ్చార్జ్ తీవ్రమైన దురద వస్తుంది.
ట్రైకోమోనియాసిస్: ఇది లైంగిక సంక్రమణ వ్యాధి (STD). దీనివల్ల పసుపు, ఆకుపచ్చ లేదా బూడిద రంగులో ఉండే నురుగు డిశ్చార్జ్, దురద, మంట, కడుపు నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

హార్మోన్ల మార్పులు: గర్భం, రుతుచక్రం, మెనోపాజ్ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల డిశ్చార్జ్ పరిమాణం రంగు మారవచ్చు. ఇది సాధారణంగా ప్రమాదకరం కాదు.
పరిష్కారాలు: యోని ప్రాంతాన్ని ఎప్పుడూ పొడిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. సువాసనతో కూడిన సబ్బులు, పౌడర్లు వాడకూడదు. కాటన్ లోదుస్తులు ధరించడం వల్ల గాలి తగిలి, తేమ తగ్గతుంది. ఆరోగ్యకరమైన ఆహారం ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. పెరుగు ఇతర పులిసిన ఆహారాలు తీసుకోవడం వల్ల యోనిలో మంచి బాక్టీరియా పెరుగుతుంది. ఇక అసాధారణమైన డిశ్చార్జ్ కనిపించినట్లయితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
వైట్ డిశ్చార్జ్ అనేది మహిళల ఆరోగ్యంలో ఒక ముఖ్యమైన భాగం. దానిలో వచ్చే అసాధారణ మార్పులను గమనించడం ద్వారా మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సరైన పరిశుభ్రత, ఆరోగ్యకరమైన అలవాట్లు వైద్య సలహాలతో ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు. మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం అవగాహనా కోసం మాత్రమే ఏదైనా ఆరోగ్య సమస్యలకు, సరైన నిర్ధారణ చికిత్స కోసం వైద్య నిపుణుడిని సంప్రదించడం తప్పనిసరి.