ఆ 4 సిరప్ లు బ్యాన్ చేయాలని ప్రపంచ దేశాలకు WHO ఆదేశం

-

భారత్​కు చెందిన మెయిడెన్ ఫార్మా కంపెనీ ఉత్పత్తి చేసిన దగ్గు, జలుబు మందుల వల్ల ఆఫ్రికాలోని గాంబియాలో 66 మంది చిన్నారులు మరణించారని.. మరికొందరు కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారనే వార్తల నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ చర్యలు చేపట్టింది. ప్రొమెతజైన్​ ఓరల్ సొల్యూషన్​, కాఫెక్స్​మాలిన్ బేబీ కాఫ్​ సిరప్, మాకాఫ్​ బేబీ కాఫ్​ సిరప్, మేగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్​ విషయంలో మెయిడెన్ ఫార్మాకు అలర్ట్ జారీ చేసింది డబ్ల్యూహెచ్​ఓ.

ఈ ఔషధాల ఉత్పత్తిలో పూర్తిస్థాయిలో భద్రత, నాణ్యతా ప్రమాణాల్ని పాటించినట్టుగా ఇప్పటివరకు ఆ సంస్థ తమకు తగిన ఆధారాలు సమర్పించలేదని చెప్పింది. ఈ ‘కలుషిత’ ఔషధాలు ప్రస్తుతానికి గాంబియాలోనే వెలుగు చూసినా.. ఇతర దేశాలకూ వాటిని సరఫరా చేసి ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఆ నాలుగు సిరప్​లు మార్కెట్​లో లేకుండా చేయాలని అన్ని దేశాలకు డబ్ల్యూహెచ్​ఓ సూచించింది.

గాంబియాలో చిన్నారుల మరణాల నేపథ్యంలో ఈ నాలుగు ఔషధాలపై సెప్టెంబర్​లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఫిర్యాదు అందింది. ఆయా సిరప్​లలో అధిక మోతాదుల్లో డైఎథిలీన్​ గ్లైకాల్​, ఎథిలీన్ గ్లైకాల్​ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఆ రెండూ చాలా ప్రమాదకరమని, మరణానికీ కారణం కావచ్చని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది.

“డైఎథిలీన్​ గ్లైకాల్​, ఎథిలీన్ గ్లైకాల్ కారణంగా కడుపు నొప్పి, వాంతులు, డయేరియా, మూత్ర విసర్జనలో ఇబ్బందులు, తల నొప్పి, మానసికంగా అనిశ్చితి, తీవ్రమైన కిడ్నీ సమస్యలు తలెత్తి.. చివరకు మరణానికి దారి తీయవచ్చు” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది. సంబంధిత సంస్థలు ఆయా సిరప్​లను విశ్లేషించి, క్లియరెన్స్​లు ఇచ్చే వరకు వాటిని హానికరమైన ఔషధాలగానే పరిగణించాలని సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version