ఈగలు, దోమలు అంటే మురికి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. ఈగలు అయితే ఆహారంపై ఎక్కువగా వాలతాయి. ఈగలు వాలిన ఆహారం చూస్తే అస్సలు తినబుద్ధి కాదు. మన ఇళ్లలో కనిపించే ఈగలు కేవలం 15 నుంచి 25 రోజులు మాత్రమే జీవిస్తాయి. అవి పగటిపూట ఎక్కువగా సంచరిస్తూ.. నేల, గోడ, సీలింగ్ ఫ్యాన్, కిటికీల వంటి వాటిని ఆవాసంగా చేసుకుంటాయి. కిటీకీల దగ్గర వాటికి కావాల్సినంత వెచ్చదనం లభిస్తుంది. అందుకే ఆ ప్రదేశంలో ఎక్కువ సేపు ఉండటానికి ఇష్టపడతాయి. ఈగలు కూడా నిద్రపోతాయి. అవి నేల, మొక్కలు, కంచె తీగలు, చెత్తడబ్బాలను తమ నిద్ర కోసం ఎంచుకుంటాయట. వాటికి వాతావరణం మరీ చల్లగా ఉన్నా.. మరీ వేడిగా ఉన్నా నచ్చదు. అందుకే ఎప్పుడూ ఒక స్థిరమైన ఉష్ణోగ్రతను చూసుకుంటాయి.
మనుషులపై ఎందుకు వాలతాయి..?
మనుషుల చర్మంపై కొంత నూనె, ఉప్పు, మృత కణాలుంటాయి. ఈగలు కేవలం ఇళ్లలో కనిపించే ఆహారం మాత్రమే తినవు. మానవ శరీరంపై ఉండే.. కంటికి కనిపించని వ్యర్థాలు కూడా వాటికి ఆహారమే. అందుకే వాలుతుంటాయి. ఆ సమయంలో మనం చిరాకుతో వాటిని చంపడానికి యత్నించినా సులభంగా తప్పించుకుంటాయి. వాటి తీక్షణమైన కళ్లతో ప్రమాదాన్ని ముందే పసిగట్టి 100 మిల్లీ సెకండ్లలోనే ఎగిరిపోతాయట. ఈగలు ఎక్కడ వాలినా కళ్లతో ఆ పరిసరాలను నిశితంగా గమనిస్తూ ఉంటాయి.
100కు పైగా వ్యాధులు
వ్యాధులను వ్యాపింపజేయడంలో ఈగల పాత్ర కీలకం. ఒక ఈగ మనం తినే పదార్థాలపై వాలిందంటే దానిలో 100కు పైగా వ్యాధి కారకాలు చేరినట్లే అని నిపుణులు అంటున్నారు. అంతే కాకుండా అవి గుడ్లు పెట్టినా, మల విసర్జన చేసినా వ్యాధులు వ్యాపిస్తాయి. ఈగలు ఏదైనా ఆహారం తింటే దాన్ని మళ్లీ బయటకు రప్పిస్తాయి. ద్రవరూపంలోకి మార్చుకుని తిరిగి కడుపులోనికి పంపించుకుంటాయి. ఆహార పదార్థాలపై లేదా మన శరీరంపై వాలినపుడు కూడా అవి ఇలానే చేసే అవకాశం ఉంది.