చలికాలం లో మన చుట్టూ వాతావరణం ఆహ్లాదంగా మారి మనకు ఆనందన్నీ కలుగజేస్తుంది. కానీ, ఆస్తమా ఉన్నవారికి మాత్రం ఈ చలిగాలులు సవాల్‌గా నిలుస్తాయి. గాలిలో తేమ తగ్గడం, చల్లని గాలుల వల్ల శ్వాసనాళాలు కుంచించుకుపోయి ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. అయితే భయపడాల్సిన అవసరం లేదు. సరైన జాగ్రత్తలు, నిపుణుల సలహాలు పాటిస్తే ఈ కాలంలో కూడా ఆస్తమాను సమర్థవంతంగా అదుపులో ఉంచుకోవచ్చు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చలికాలాన్ని ఆస్వాదించేందుకు కొన్ని కీలక మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చలికాలంలో ఆస్తమా ఎటాక్స్‌ను నివారించాలంటే పక్కా ప్రణాళిక అవసరం. బయట చలి ఎక్కువగా ఉన్నప్పుడు, ముఖ్యంగా వేకువజామున లేదా రాత్రి సమయాల్లో బయటకు వెళ్లకపోవడమే మంచిది. ఒకవేళ వెళ్లాల్సి వస్తే, ముక్కు మరియు నోటిని కప్పి ఉంచేలా స్కార్ఫ్ లేదా మాస్క్ ధరించాలి. ఇది ఊపిరితిత్తుల్లోకి వెళ్లే గాలిని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది.
అలాగే, ఇంట్లో దుమ్ము, ధూళి లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. చలికాలంలో కిటికీలు మూసి ఉంచడం వల్ల ఇంట్లోనే అలర్జీ కారకాలు పెరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇండోర్ ఎయిర్ క్వాలిటీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
ఆస్తమా రోగులు ఈ సీజన్‌లో తమ ఇన్హేలర్లను ఎప్పుడూ వెంట ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తారు. డాక్టర్ సూచించిన ప్రివెంటివ్ మందులను ఒక్క రోజు కూడా మర్చిపోకుండా వాడాలి. స్వల్పంగా జలుబు లేదా దగ్గు అనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ఎందుకంటే సాధారణ ఇన్ఫెక్షన్లు కూడా ఆస్తమాను తీవ్రతరం చేస్తాయి. దీంతో పాటు, శరీర రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. వేడివేడి సూప్‌లు, అల్లం టీ మరియు విటమిన్-సి పుష్కలంగా ఉండే పండ్లను డైట్‌లో చేర్చుకోవడం వల్ల శ్వాసకోశ వ్యవస్థ బలంగా ఉంటుంది.
ఆస్తమా అనేది భయపడాల్సిన జబ్బు కాదు, సరైన పద్ధతిలో మేనేజ్ చేయాల్సిన ఆరోగ్య స్థితి. చలికాలంలో మన శరీరం ఇచ్చే సంకేతాలను గమనిస్తూ, క్రమం తప్పకుండా వ్యాయామం (ఇంట్లోనే) చేస్తూ, మానసిక ఒత్తిడికి లోనుకాకుండా ఉంటే ఆస్తమాను సులభంగా జయించవచ్చు.
చలి నుంచి రక్షణ పొందేందుకు వెచ్చని దుస్తులు ధరించడం మరియు తగినంత నీరు తాగడం మర్చిపోవద్దు. నిపుణుల మార్గదర్శకాలను పాటిస్తూ, అప్రమత్తంగా ఉంటే ఈ చలికాలం మీకు ఎంతో సుఖమయంగా సాగుతుంది.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఆస్తమా తీవ్రత వ్యక్తిని బట్టి మారుతుంటుంది. కాబట్టి, మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి డాక్టర్ ను సంప్రదించండి.
