పొట్ట దగ్గర కొవ్వును కరిగించే ఆసనం.. వేయడం చాలా తేలిక

-

ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజు కొన్ని ఆసనాలను ప్రాక్టీస్‌ చేస్తే చాలు. మానసికంగా, శారీరకంగా హెల్తీగా ఉంటారు. యోగాలో ఒక్కో సమస్యకు ఒక్కో రకరమైన ఆసనం ఉంది. కొన్ని యోగాసనాలు తేలిగ్గా ఉంటాయి, మరికొన్ని కాస్త కష్టంగా ఉంటాయి. సులభంగా వేయదగిన ఆసనాల్లో భుజంగాసనం కూడా ఒకటి. సంస్కృతంలో భుజంగ అనే పదానికి పాము అని అర్థం వస్తుంది. పాము పడగ విప్పినప్పుడు ఎలాగైతే ఆకారంలో ఉంటుందో సరిగ్గా అదే ఆకారంలో ఈ ఆసనాన్ని వేయాల్సి ఉంటుంది. భుజంగాసనాన్ని ఎలా వేయాలి.. దీంతో ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మ్యాట్ పై బోర్లా పడుకోవాలి. తరువాత చేతులపై నెమ్మదిగా ఛాతి భాగాన్ని పైకి లేపాలి. అనంతరం తలను పైకెత్తి చూడాలి. పడగ విప్పిన పాము ఆకారంలో ఆసనం రావాలి. ఈ భంగిమలో 5 నిమిషాల పాటు ఉండాలి. తరువాత మళ్లీ మామూలు స్థితికి రావాలి. ఇలా ఈ ఆసనాన్ని ఆరంభంలో రోజూ కనీసం 5 నిమిషాల పాటు అయినా సరే వేయాలి. తరువాత సౌకర్యాన్ని బట్టి ఈ ఆసనం సమయాన్ని పెంచుతూ పోవచ్చు. ఇలా ఈ ఆసనాన్ని రోజూ వేయడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.

భుజంగాసనం వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

భుజంగాసనం వేయడం వల్ల భుజాలు, మెడ భాగాల్లో ఉండే దృఢత్వం పోతుంది. దీంతో ఆయా భాగాల్లో ఉండే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజూ కంప్యూటర్ల ఎదుట కూర్చుని పని చేసేవారికి భుజాలు, మెడ భాగాలు నొప్పిగా ఉంటాయి. అలాంటి వారు ఈ ఆసనం వేస్తే నొప్పుల నుంచి ఎంతగానో ఉపశమనం లభిస్తుంది.

ఈ ఆసనం వేయడం వల్ల ఛాతి, పొట్ట కండరాలు దృఢంగా మారుతాయి. ఆస్తమా, దగ్గు, జలుబు ఉన్నవారికి మేలు జరుగుతుంది.

పొత్తి కడుపు కండరాలపై ఒత్తిడి పడుతుంది. కనుక పొట్ట దగ్గర ఉండే కొవ్వు కరుగుతుంది. నెల రోజుల పాటు ఈ ఆసనాన్ని వేస్తే వచ్చే మార్పును మీరే గమనిస్తారు.

ఈ ఆసనం వేయడం వల్ల వెన్నెముక దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటుంది. వెన్ను నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

మీరు వేయకండి..

తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు, చేతుల్లో బాగా నొప్పి ఉన్నవారు, దృఢత్వం లేని వారు ఈ ఆసనాన్ని వేయకూడదు. మిగిలిన ఎవరైనా సరే ఈ ఆసనాన్ని వేసి ప్రయోజనాలను పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news