తల్లి రాజవ్వ ధాన్యం నింపుతున్నప్పుడు పడే శ్రమను చూసిన అభిషేక్ ఆమె పనిని సులభతరం చేయాలని అనుకున్నాడు. వెంటనే ధాన్యం నింపేందుకు ఉపయోగపడేలా ఓ నూతన పరికరాన్ని తయారు చేశాడు.
అద్భుతాలు సృష్టించేందుకు నిజంగా వయస్సుతో పనిలేదు. ఎంతటి వారైనా ఏమైనా చేయవచ్చు. చిన్న వయస్సులో ఉన్నా సరే.. అందుకు ఆ వయస్సు అడ్డం కాదు. వయస్సే కాదు, ప్రతిభ, పట్టుదల ఉండాలే కానీ చిన్నారులు కూడా ఏమైనా సాధించవచ్చని ఆ బాలుడు నిరూపించాడు. అతనే మర్రపల్లి అభిషేక్. తన తల్లి పడుతున్న శ్రమను తగ్గించేందుకు ఇతను ఓ కొత్త పరికరాన్ని ఆవిష్కరించాడు. ఏకంగా సీఎం కేసీఆర్‌నే అబ్బుర పరిచాడు. వివరాల్లోకి వెళితే…
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజి పేట గ్రామానికి చెందిన మర్రపల్లి అభిషేక్ స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి లక్ష్మీరాజన్ పని కోసం దుబాయ్ వెళ్లాడు. ఈ క్రమంలో అతని తల్లి రాజవ్వ స్థానికంగా ఉన్న ఇందిరా క్రాంతి పథం ధాన్యం కొనుగోలు కేంద్రంలో కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అందులో భాగంగా ఆమె ధాన్యం కొనుగోలు కేంద్రంలో గన్నీ సంచులను ధాన్యంతో నింపాల్సి ఉంటుంది.
అయితే తన తల్లి రాజవ్వ ధాన్యం నింపుతున్నప్పుడు పడే శ్రమను చూసిన అభిషేక్ ఆమె పనిని సులభతరం చేయాలని అనుకున్నాడు. వెంటనే ధాన్యం నింపేందుకు ఉపయోగపడేలా ఓ నూతన పరికరాన్ని తయారు చేశాడు. అందుకు గాను అతనికి రూ.5వేలు ఖర్చైంది. ఆ పరికరానికి వీల్స్ ఉంటాయి. ఐరన్ షీట్లు, పైపులు, రాడ్స్‌తో అతను ఆ పరికరాన్ని తయారు చేశాడు. దాన్ని ఎక్కడికంటే అక్కడికి సులభంగా తీసుకువెళ్లవచ్చు. ఇక ఆ యంత్రం ద్వారా గన్నీ సంచులను సులభంగా ధాన్యంతో నింపవచ్చు. ముగ్గురు చేసే పనిని ఆ ఒక్క యంత్రమే చేస్తుంది. ఈ క్రమంలో అభిషేక్ రూపొందించిన యంత్రం గురించి సీఎం కేసీఆర్ తెలుసుకున్నారు. అతనికి రూ.1.16 లక్షల చెక్కును బహుమతిగా అందజేశారు. అలాగే అతని విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చును కూడా భరిస్తామని తెలిపారు.
అయితే అభిషేక్ మీడియాతో మాట్లాడుతూ.. తాను రూపొందించిన యంత్రం రైతులు, కూలీలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నాడు. తనకు ఆర్థిక సహాయం అందజేస్తే ఇలాంటి మరిన్ని పరికరాలను తయారు చేస్తానని అతను చెబుతున్నాడు. ఏది ఏమైనా అభిషేక్ తెలివితేటలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అతను ఆశించినట్లుగా దాతలు సహాయం చేయాలని, అతను ఇలాంటివే మరిన్ని యంత్రాలు, పరికరాలు తయారు చేయాలని ఆశిద్దాం..!