ఆలోచన ఉండాలేగానీ పనికిరాదనుకునే వస్తువుతోనూ డబ్బులు సంపాదించవచ్చు. అవును.. సరిగ్గా అలా అనుకున్నాడు కాబట్టే అతను వరిగడ్డితో రూ.లక్షలు సంపాదిస్తున్నాడు. విదేశాల్లో చేసే ఉద్యోగాన్ని కూడా వదులుకుని అతను ఇండియాకు వచ్చి సొంతంగా వ్యాపారం చేస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పించడమే కాదు, ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు కూడా. మరోవైపు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్నాడు. అతనే.. హర్యానాకు చెందిన వీరేందర్ యాదవ్.
వీరేందర్ యాదవ్ కురుక్షేత్ర యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందాడు. 2008లో ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడ కూరగాయలను అమ్మడం మొదలు పెట్టాడు. అయితే 2018లో అతను తన తల్లికి అనారోగ్యం రావడంతో ఇండియాకు వచ్చాడు. అయితే హర్యానాలోని కైతల్ జిల్లాలో ఉన్న తమ గ్రామం ఫరష్ మజ్రాలో ఎండు గడ్డిని తగలబెట్టడం వల్ల విపరీతమైన పొగ వచ్చేది. అదే గ్రామం కాకుండా చుట్టు పక్కల అనేక గ్రామాల్లో ఈ సమస్య ఉండేది. కానీ దీనికి వీరేందర్ పరిష్కారం కనుగొన్నాడు. ప్రభుత్వ సహాయంతో మొత్తం 6 బేలర్ యంత్రాలను కొనుగోలు చేసి ఎండు గడ్డిని చుట్టల్లా చుడుతూ వాటిని అగ్రి ఇండస్ట్రీలకు, పేపర్ తయారీ పరిశ్రమలకు పంపడం మొదలు పెట్టాడు. దీంతో అతను కేవలం 2 నెలల్లోనే ఏకంగా రూ.95 లక్షలు సంపాదించాడు. అంతేకాదు మరో 150 మందికి ఉపాధి కల్పించాడు.
అలా వీరేందర్ చేస్తుండడం వల్ల తనకు ఆదాయం రావడమే కాదు, ఇతరులకు ఉపాధి దొరుకుతోంది. పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతోంది. ఈ క్రమంలో అతనికి పరిశ్రమల నుంచి విపరీతమైన ఆర్డర్లు వస్తున్నాయి. అయినప్పటికీ అతను ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మరిన్ని యంత్రాలను కొనుగోలు చేస్తూ మరింత మందికి పని కల్పిస్తూ పెద్ద ఎత్తున వ్యాపారం చేయడం కొనసాగిస్తున్నాడు. అతను గత 2 నెలల్లోనే కంపెనీల నుంచి ఏకంగా 70వేల ఆర్డర్లను రాబట్టడం విశేషం. అవును.. ఆలోచన ఉండాలే కానీ ఎలాగైనా అద్భుతాలు చేయవచ్చు. అందుకు వీరేందరే అత్యుత్తమ ఉదాహరణ అని చెప్పవచ్చు.