భారత పురుషుల హాకీ జట్టు జర్మనీని 5-4 తేడాతో ఓడించి ఒలంపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన విషయం విదితమే. మన్ ప్రీత్ సింగ్ కెప్టెన్సీలో 41 సంవత్సరాల తర్వాత భారత్ హాకీలో ఒలింపిక్ మెడల్‌ను సాధించింది. అయితే ఈ విజయం అంత సులభంగా వచ్చిందేమీ కాదు, దాని వెనుక ఎంతో కృషి, శ్రమ, పట్టుదల ఉన్నాయి.
తన కెరీర్‌లో మన్‌ప్రీత్ 259 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. జలంధర్‌లోని చిన్న గ్రామమైన మిథాపూర్‌కు చెందిన మన్‌ప్రీత్ ఒక సాధారణ బాలుడే. అతను వీడియో గేమ్‌లు ఆడుతూ, రోజంతా సంగీతం వింటూ సమయాన్ని గడిపేవాడు. 9 సంవత్సరాల వయస్సులో అతను తన తండ్రి, సోదరులు హాకీ ఆడటం చూసినప్పుడు తాను ఆ క్రీడను కూడా ఆడడానికి ప్రేరణ పొందాడు. కానీ అతని కుటుంబం అందుకు ఆమోదించలేదు.
అయినప్పటికీ మన్‌ప్రీత్ పట్టు వదలకుండా ప్రాక్టీస్ చేశాడు. హిందుస్థాన్ టైమ్స్‌తో తన అనుభవాలను పంచుకుంటూ.. ఒక రోజు తనకు, 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, తాను కోచింగ్ కోసం బయలుదేరబోతున్న సమయంలో తన సోదరుడు తనను గదిలో బంధించాడని, అయినా తాను కోచింగ్ గ్రౌండ్‌కు వెళ్లి అతనితో చేరగలిగానని, దీంతో తన సోదరుడు ఆగ్రహం వ్యక్తం చేశాడని.. తెలిపాడు. తనను కొట్టబోయాడని, కానీ తాను చాలా ఆసక్తిగా ఉన్నందున ఆట నేర్చుకోవడానికి తనకు అవకాశం ఇవ్వాలని కోచ్ చెప్పారని.. తెలిపాడు.
మన్‌ప్రీత్ క్రీడా జీవితంలో ప్రారంభ దశలో కూడా సమస్యలు వచ్చాయి. మన్ ప్రీత్ తండ్రి 2016 లో మరణించారు. ముగ్గురు పిల్లలను పెంచే బరువును తన తల్లి భుజాలపై వేసుకున్నారు. అయినప్పటికీ, అతను తన దృఢ నిశ్చయంతో తన కలను సాకారం చేసుకోవడానికి శ్రమించాడు. అందుకు తన తల్లి కూడా శక్తి వంచన లేకుండా శ్రమించింది. ఈ క్రమంలోనే మన్‌ప్రీత్ మాట్లాడుతూ.. తన తల్లి శ్రమించకపోతే తాను ఈ రోజు కెరీర్‌లో ఇంతటి స్థానానికి వచ్చేవాడిని కాదని, అందుకు ఆమెకు రుణపడి ఉంటానని తెలిపాడు.
స్టార్ ఛాంపియన్ బాక్సర్ మేరీ కోమ్, మాజీ హాకీ కెప్టెన్, ఫ్లాగ్ బేరర్ పర్జత్ సింగ్, క్రిస్టియానో రొనాల్డో వంటి వివిధ క్రీడాకారులు తన జీవితంలో వివిధ దశల్లోప్రేరణ కలిగించారని తెలిపాడు. వారి విజయ గాథలు తనకు పెద్ద ప్రేరణగా నిలిచాయని చెప్పాడు. కాగా మన్‌ప్రీత్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేయగా, 2013 లో జూనియర్ జాతీయ జట్టుకు నాయకత్వం వహించాడు. అతని కెప్టెన్సీలో పురుషుల హాకీ జట్టు జూనియర్ వరల్డ్ కప్, ఇంచియాన్‌లో ఆసియా గేమ్స్, 2013 సుల్తాన్ ఆఫ్ జోహోర్ కప్‌లో స్వర్ణంలను గెలుచుకుంది.అలాగే గ్లాస్గోలో జరిగిన 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించింది.
మా జట్టులో మాకు సీనియర్ ఆటగాళ్లు, జూనియర్ ఆటగాళ్లు అనే తేడాలు లేవు, జట్టులోని ప్రతి ఒక్కరూ సంకోచం లేదా భయం లేకుండా ఆడటానికి కృషి చేస్తాం.. అని మన్‌ప్రీత్ తెలిపాడు. మిథాపూర్ గ్రామంలో పెరగడం, హాకీ ఆడటం నుండి భారత బృందానికి ఫ్లాగ్ బేరర్‌గా పేరు తెచ్చుకోవడం వరకు తనలాంటి ఆటగాడికి గొప్ప గౌరవం దక్కిందని అన్నాడు. అయితే అతను చెప్పినట్లుగానే కాంస్య పతకంతో తిరిగి వచ్చాడు.