రేపెలా ఉండాలనుకుంటున్నావో ఈ రోజు అలా ఉండాలని చెప్పే అద్భుతమైన కథ..

-

ఒకానొక భైరాగి ఊర్లు పట్టుకు తిరుగుతున్నాడు. శాంతి కోసం ధ్యానం చేస్తూ ఒక్కో ఊరూ, అడవి అంతా తిరుగుతున్నాడు. అలా ఒక రోజు మహారాజు త్రినేత్ర వర్మ రాజ్యానికి చేరుకున్నాడు. ఆ భైరాగిని ఆదరంగా స్వాగతించిన త్రినేత్ర వర్మ అతిధి మర్యాదలతో సత్కరించాడు. ఐతే ఆ రాజుకి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకుకి కోపం ఎక్కువ. ఎవ్వరి మాటా వినడు. ప్రజలని పట్టించుకోడు. త్రినేత్ర వర్మ తన కొడుకు ప్రవర్తన వల్ల ఇబ్బంది పడుతూ ఉండేవాడు.

ఈ విషయాన్ని ఆ భైరాగికి చెప్పిన త్రినేత్ర వర్మ ఏదైనా సాయం చేయమని చెప్పాడు. అంతా విన్న భైరాగి సరే అన్నాడు. ఒకరోజు త్రినేత్ర వర్మ కొడుకు తోటలో కూర్చున్నాడు. అక్కడికి భైరాగి వెళ్ళాడు. ఇద్దరూ ఏదో మాట్లాడుతున్నారు. మాటల మధ్యలో భైరాగి ఒక చెట్టు వద్దకి వెళ్ళి, ఆ ఆకులను కోయమని చెప్పాడు. ఆకులు కోసిన కొడుకు ఏం చేయాలన్నట్టు భైరాగి వైపు చూసాడు. అపుడు భైరాగి ఇలా అన్నాడు.

యువరాజా.. ఆ ఆకులను తినండి అన్నాడు. భైరాగి మాటలకు తగినట్లుగానే యువరాజు ఆ ఆకులను నోట్లో పెట్టుకున్నాడు. కొద్దిగా రుచి చూడగానే ఛీ.. అంటూ ఉమ్మేసి, చాలా చేదుగా ఉంది నేను తినను అన్నాడు. అది చూసిన భైరాగి, చూసావా యువరాజా.. ఆ మొక్క ఇంకా చిన్నగానే ఉంది. అయినా కూడా ఆకులు చేదుగా ఉన్నాయి. చిన్నగా ఉన్నప్పుడే ఇంత చేదుగా ఉన్నట్లయితే పెద్దగా మారిన తర్వాత ఇంకా ఎంత చేదుగా ఉంటుందో అర్థం చేసుకో అన్నాడు.

యువరాజుకి అంతా అర్థమైంది. ఇప్పుడే ఇలా ఉంటే రేపు ప్రజలతో ఎలా సన్నిహితంగా ఉండగలం అని అర్థం చేసుకున్న యువరాజు తన ప్రవర్తనని మార్చుకున్నాడు. మీ జీవితంలో రేపెలా ఉండాలని అనుకుంటున్నారో ఈ రోజే అలా ఉండండి. అప్పుడే మీరనుకున్నది సాధించగలుగుతారు. డేర్ టూ మోటివేషన్ ఆధారంగా చెప్పే అద్భుతమైన కథ.

Read more RELATED
Recommended to you

Exit mobile version