ఓడిపోవాలని ఎవ్వరికీ ఉండదు. కానీ జీవితంలో ఓటమి చాలా సహజం. ప్రతీ ఒక్కరూ ఓడిపోతారు. పిల్లలుగా ఉన్నప్పుడు ఏడవని వాళ్ళు, పెద్దలైన తర్వాత ఓడిపోని వాళ్లు ఎవ్వరూ లేరు. అయితే ఓడిపోయిన తర్వాత ఓటమిని ఎలా ఎదుర్కుంటావనేదే ముఖ్యం. దాని నుండి ఏ విధంగా బయటపడాలనేది ఇంపార్టెంట్.
ఓటమి బాధ నుండి బయటపడడానికి కొన్ని పద్ధతులు పనిచేస్తాయి.
ఫైవ్ మినిట్స్ రూల్:
దీని అర్థం ఏంటంటే.. ఓటమి బాధను కేవలం ఐదు నిమిషాలు మాత్రమే అనుభవించాలి. ఐదు నిమిషాల్లోనే మీ ఏడుపైనా ఇంకేదైనా ఉండాలి. బాధపడటం మొత్తం ఐదు నిమిషాల్లోనే అయిపోవాలి. ఆ తర్వాత బాధపడటం పూర్తిగా మానేయాలి. ఓడిపోయినప్పుడు బాధ కచ్చితంగా ఉంటుంది. దాన్ని కాదనలేము. కానీ ఎంతసేపు బాధపడాలనేది మన చేతుల్లో ఉంటుంది కాబట్టి ఐదు నిమిషాలు బాధపడండి.
విశ్రాంతి తీసుకోండి:
ఓడిపోయిన తర్వాత కాస్త విశ్రాంతి అవసరం. ఈ విశ్రాంతి సమయంలో మీరు చాలా ప్రశాంతంగా ఉండాలి. ఓటమి బాధను మనసులోకి తీసుకురాకూడదు. పూర్తిగా డైవర్ట్ అయిపోయి మనసుని ప్రశాంతంగా మార్చుకోండి. దీనికోసం మీకు నచ్చిన సినిమాలు చూడటమో, నచ్చిన పనులు చేయటమో చేయాలి.
ఓటమి నుండి నేర్చుకోండి:
విశ్రాంతి తీసుకున్న తర్వాత నెమ్మదిగా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోండి. ప్రతిదీ ఏదో ఒక పాఠం నేర్పిస్తుంది. ఓటమి నేర్పించే పాఠం చాలా విలువైనది. ఆ పాఠాన్ని మనసులోకి తీసుకుని తిరిగి పని మొదలు పెట్టండి.
కొత్త లక్ష్యాలు పెట్టుకోండి:
పాఠం నేర్చుకున్న తర్వాత ఓటమి గురించి బాధపడవద్దు. పాఠం నేర్చుకునేది మళ్లీ పరీక్ష రాయడానికే కాబట్టి కొత్త లక్ష్యాలు పెట్టుకోండి. మీ దృష్టి మొత్తం వాటి మీదనే ఉంచండి.
ఓదార్పు:
ఒక్కోసారి ఓటమి బాధ నుండి బయట పడాలంటే మనవాళ్ల నుండి ఓదార్పు అవసరం అవుతుంది. మీకు క్లోజ్ గా ఉండే వ్యక్తులతో మాట్లాడండి. వాళ్ల మాటలు మీ మనసుకు ఓదార్పు కలగజేస్తాయి.