పారిస్ ఒలింపిక్స్ 2024లో ఇండియాకి మరో మెడల్ లభించింది. ఇప్పటి దాకా ఇండియాకు మొత్తం 6 మెడల్స్ వచ్చాయి. పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల వెయిట్ విభాగంలో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.బ్రాంజ్ మెడల్ పోటీలో అమన్ 13-5తో ప్యూర్టోరికోకు చెందిన డారియన్ టోయ్ క్రూజ్ పై గెలిచాడు. అమన్ సెహ్రావత్ ఒలింపిక్ జర్నీ విషయానికి వస్తే ఎన్నో కష్టాలతో కూడుకున్నది. ఆయన కథని ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
21 ఏళ్ల అమన్ సెహ్రావత్ ఒలింపిక్స్ జర్నీ అంత ఈజీ కాదు. ఎందుకంటే అమన్ సెహ్రావత్ తన చిన్నతనంలోనే తనకు అండగా ఉండే తల్లిదండ్రులను కోల్పోయాడు. జాట్ ఫ్యామిలీకి చెందిన అమన్ హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలోని బిరోహార్ నుంచి వచ్చాడు.ఆయన 11 సంవత్సరాల వయస్సులో తన తల్లిదండ్రులను కోల్పోయాడు. గతంలో అమన్ పది సంవత్సరాల వయసులో తన తల్లి గుండెపోటుతో మరణించారు. ఇక ఓ సంవత్సరం తర్వాత అతని తండ్రి కూడా చనిపోవడం జరిగింది.ఆ తరువాత.. అమన్, అతని చెల్లెలు పూజా సెహ్రావత్ వారి పెద్ద మేనమామ సుధీర్ సెహ్రావత్ దగ్గర ఉన్నారు. తన తల్లిదండ్రుల విషాద మరణం తరువాత, అమన్ ఎంతగానో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అతని తాత మాంగేరామ్ సెహ్రావత్ అతనిని జాగ్రత్తగా చూసుకున్నాడు.
ఇక అమన్ తిరిగి కోలుకోవడంలో అతని తాత గారు ముఖ్యమైన పాత్ర పోషించాడు. అమన్ రెజ్లింగ్‌పై ప్రేమని కొనసాగించాడు. కోచ్ లలిత్ కుమార్ వద్ద శిక్షణ తీసుకోవడం మొదలు పెట్టాడు. అమన్ తన మొదటి జాతీయ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకోని 2021లో లైట్ లోకి వచ్చాడు. 2022 ఆసియా క్రీడల్లో అమన్ 57 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత 2023 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో అయితే ఏకంగా బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. జనవరి 2024లో.. అతను జాగ్రెబ్ ఓపెన్ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో గోల్డ్ మెడల్ సాధించి దేశానికి కీర్తిని తెచ్చాడు. పారిస్ 2024 ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారతదేశం నుంచి ఏకైక పురుష రెజ్లర్ గా అమన్ చరిత్ర సృష్టించాడు.