పట్టుదలతో 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి శభాష్ అనిపిస్తున్న అంధురాలు!

-

ఆమె ఒక అంధురాలు. కానీ ఆ చీకటిలోనే వెలుగు వెతుక్కింది. నేనొక అంధురాలిని ఏమి చెయ్యలేను అని ఏనాడు క్రుంగిపోకుండా తన వైకల్యాన్ని బలంగా మార్చుకొని ముందుకు సాగింది. ఏకంగా 6 ప్రభుత్వ ఉద్యోగాలని సాధించి అందరికి ఆదర్శంగా నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండకు చెందిన వారు శ్రీ పూజిత.

ఈమె తండ్రి పేరు రాజశేఖర్. ఈయన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అమ్మ పేరు స్వర్ణలత. ఈమె కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులే. వీరికి అంధురాలైన శ్రీ పూజిత జన్మించింది. అయినా కానీ వీరు ఏమాత్రం కుంగిపోకుండా కూతురు శ్రీ పూజితను అంధురాలిగా కాకుండా ఓ సాధారణ యువతిలాగా అల్లారు ముద్దుగా పెంచారు. శ్రీ పూజిత చదువు విషయానికి వస్తే పదోతరగతి దాకా నల్గొండ అంధుల పాఠశాలలో చదివింది. ఇంటర్‌మీడియట్ సాయి అంధుల జూనియర్‌ కళాశాల (హైదరాబాద్‌)లో పూర్తి చేసింది. ఇంకా అలాగే డిగ్రీ బీఏ కోర్సు నల్గొండ ఎన్జీ కళాశాలలో, పీజీ హిస్టరీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, బీఈడీ నల్గొండ గోకుల్‌ కళాశాలలో పూర్తి చేసింది. ఏకంగా జాతీయ స్థాయిలో నిర్వహించే నెట్‌కు కూడా అర్హత సాధించిందంటే తానెంత ప్రతిభావంతురాలో అర్థం చేసుకోవచ్చు.

తాను అంధురాలని ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇంకా నిరుత్సాహపడకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో బాగా కష్టపడి చదివి ఉన్నత విద్యని పూర్తి చేసింది శ్రీ పూజిత.2022లో మొదటి ప్రయత్నంలోనే నల్గొండ జిల్లా కోర్టులో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం సంపాదించింది. అలా ఆ ఉద్యోగం చేస్తూనే తెలంగాణ గురుకుల లెక్చరర్‌ ఉద్యోగానికి కూడా సిద్ధమైంది.ఇక గురుకుల ఫలితాల్లో ఏకంగా ఆరు ఉద్యోగాలు సాధించింది. పీజీటీ (పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌) తెలుగు, సోషల్, టీజీటీ (ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌) తెలుగు, సాంఘికశాస్త్రం, జూనియర్‌ లెక్చరర్‌ తెలుగు, డిగ్రీ లెక్చరర్‌ తెలుగు ఉద్యోగాలను సంపాదించింది.

ఇంకా అంతే కాదు వీటితో పాటు టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు కూడా శ్రీ పూజిత హాజరైంది. ఇందులో కూడా ఏదో ఒక ఉద్యోగం కచ్చితంగా సాధించే అవకాశం ఉంది. ఒకేసారి ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన శ్రీ పూజిత ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది.తాను చూపులేనిదానినని ఏ రోజూ బాధపడలేదు. తన తల్లిదండ్రులు నిత్యం ఎంతో ఆత్మస్త్యైర్యం ఇచ్చారని చెప్పింది. టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ దాకా బ్రెయిలీ లిపిలో చదివిన ఆమె ఏ రోజూ చదువుపరంగా ఇబ్బంది పడలేదని చెప్పింది. ప్రతి అంశాన్ని కూడా తన తల్లి దండ్రులు చదివి వినిపించేవారని, అలా అన్ని అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకుని పరీక్షల్లో ఒకరి సహాయంతో బాగా రాసి ఉత్తీర్ణత పొందానని చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news