ది రెడ్ డ్రెస్ (The Red Dress) ప్రాజెక్ట్ గురించి మీరు విన్నారా? బ్రిటిష్ ఆర్టిస్ట్ కిరేష్టి మాక్లియోడ్ ప్రారంభించిన ఓకే అద్భుతమైన ఆలోచన, ఒక వస్త్రానికి ప్రపంచంలోని వేలాది కథలను అద్దడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. 51 దేశాలకు చెందిన కళాకారులు 14 సంవత్సరాలు శ్రమించి తయారు చేసిన ఈ ఎంబ్రాయిడరీ గౌను, కేవలం రికార్డు మాత్రమే కాదు, మహిళల గళాలను, వారి కళా నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప సామాజిక ఉద్యమం. ఈ చిన్ని గౌనులో దాగి ఉన్న పెద్ద కథ ఇదే మరి అది ఏమిటనేది మనము తెలుసుకుందాం ..
ఒక ఎంబ్రాయిడరీ ప్రాజెక్ట్, అనేక గళాలు: బ్రిటిష్ కళాకారిణి కిరేష్టి మాక్లియోడ్ 2009లో ‘ది రెడ్ డ్రెస్’ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఇది 87 ప్యానెల్స్‌తో కూడిన బర్గండీ సిల్క్ గౌను. ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం- ప్రపంచవ్యాప్తంగా అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలు, ముఖ్యంగా నిరాశ్రయులు, శరణార్థులు యుద్ధ బాధితులు తమ అనుభవాలు, భావోద్వేగాలు, సంస్కృతిని ఎంబ్రాయిడరీ రూపంలో ఈ వస్త్రంపై కుట్టడం. 51 దేశాల నుండి 380 మందికి పైగా కళాకారులు ఇందులో ఎక్కువ మంది మహిళలే తమ చేతి నైపుణ్యంతో ఈ డ్రెస్ పై 1.5 బిలియన్ కంటే ఎక్కువ కుట్లు వేశారు.

రికార్డు వెనుక సామాజిక సందేశం: దాదాపు 14 సంవత్సరాలు ప్రపంచమంతా ప్రయాణించిన ఈ రెడ్ డ్రెస్ ‘అతిపెద్ద సహకార ఎంబ్రాయిడరీ ప్రాజెక్ట్’ (Largest Collaborative Embroidery Project) గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ 2025లో చోటు సంపాదించింది. పాలస్తీనా, సిరియా, ఉక్రెయిన్ నుండి వచ్చిన శరణార్థులు, వివిధ దేశాల నుండి వచ్చిన ఆశ్రయం కోరుకునే మహిళలు ఈ డ్రెస్‌కు తమ సహకారాన్ని అందించారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వాములైన 141 మంది కళాకారులకు వారి పనికి వేతనం లభించింది ఇది వారి నైపుణ్యాన్ని గుర్తించి, ఆర్థికంగా తోడ్పాటునిచ్చింది. ఈ డ్రెస్ కేవలం కళాఖండం కాదు నిశ్శబ్దంగా ఉన్న ఎందరో మహిళల కథలకు ఒక వేదికగా మారింది.
మొత్తం మీద కిరేష్టి మాక్లియోడ్ సృష్టించిన ఈ ‘రెడ్ డ్రెస్’, కళకు, సామాజిక స్పృహకు మధ్య ఉన్న అద్భుతమైన బంధాన్ని చాటి చెప్పింది. ఒక సాధారణ వస్త్రం ఐన ప్రపంచంలోని భిన్న సంస్కృతులను భావోద్వేగాలను ఒకే తాటిపైకి తెచ్చి రికార్డు సృష్టించగలదని నిరూపించింది.
