ఈ రోజుల్లో యూత్ ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ టైం వేస్ట్ చేస్తుంటే ఓ కుర్రాడు మాత్రం ఏకంగా పదిహేనేళ్ల వయసులోనే ఏఐ స్టార్టప్ కంపెనీ మొదలు పెట్టి సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఆశ్చర్యపరిచాడు.ఇప్పటి దాకా ఆ కుర్రాడు ఏకంగా 10 ఏఐ యాప్‌లు, 9 కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఇంకా 15 రకాల గేమ్స్ ని డిజైన్ చేశాడంటే మామూలు విషయం కాదు.ముసలి వాళ్లకి ఉపయోగపడే ‘థర్డ్ ఏఐ’ యాప్‌తో మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు ఉదయ్.’ తన తల్లిదండ్రులకు తాను ఏమైనా సాధించగలనని గట్టి నమ్మకం ఇచ్చాడు ఆ కుర్రాడు. ఏఐ స్టార్టప్ పెట్టి మరో మైలు రాయి అందుకున్నాడు.
కోచిలో జరిగిన అంతర్జాతీయ జెన్‌ఏఐ సదస్సులో ఉదయ్‌శంకర్ స్టార్టప్ ‘ఉరవ్’కు సంబంధించి ఎగ్జిబిషన్ స్పెషల్ హైలెట్ గా మారింది. స్కూల్ వయసులోనే రోబోటిక్స్‌పై ఆసక్తి పెంచుకున్నాడు ఉదయ్. చివరకి అది అతని పాషన్‌గా మారింది. కరోనా మహమ్మారీ సమయంలో అతను ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే సమయాన్ని ఏమాత్రం వృథా చేయకుండా ఆన్‌లైన్‌లో పైథాన్‌ప్రోగామింగ్ నేర్చుకున్నాడు ఉదయ్. యాప్ డెవలప్‌మెంట్‌పై ఆసక్తి ఎక్కువగా పెంచుకున్నాడు.దానిపై గట్టి పట్టు సాధించాడు.
బహిరంగ ప్రాంతాలలో వృద్ధులకు ఉపయోగపడే ‘థర్డ్ ఏఐ’ యాప్ డిజైన్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఉదయ్ శంకర్.అతని కృషికి 2023లో ఏపీజే అబ్దుల్ కలామ్ ఇగ్నైటెడ్ మైండ్ చిల్డ్రన్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ అవార్డు కూడా లభించింది. తరువాత ఉదయ్ శంకర్ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటీ కన్పూర్ నుంచి ఏఐ సర్టిఫికెట్ కోర్సులు కూడా చేశాడు. ఇక దూర విద్య ద్వారా పదో తరగతి పూర్తి చేశాడు.ఓ రోజు శంకర్‌కు తన నాయనమ్మ ఫోన్ చేసినప్పుడు ఇంటికి రావాలని అడిగితే ఉదయ్ వెళ్లలేకపోయాడు.
అప్పుడే తన నానమ్మ రూపంలో ఉన్న ఓ ఏఐని డిజైన్ చేయాలని నిర్ణయించుకున్నానని ఉదయ్ శంకర్ తెలిపాడు. తన స్మార్ట్ ఫోన్లోనే ‘హాయ్ ఫ్రెండ్స్’ అనే యాప్‌ను డెవలప్ చేశాడు. దానిలో ఎవరి ఫొటో అయినా తీసేలా, వారి అవతార్‌ను రూపొందించేలా, అలాగే వారితో ఏ భాషలోనైనా మాట్లాడేలా డెవలప్ చేశాడు. ఇలా టెక్నాలజీపైన ఉన్న మక్కువతో దాన్ని మంచి పనులకు వాడుకొని ఎనిమిదో తరగతిలో చదువును మధ్యలోనే ఆపేసి ఏఐకి సంబంధించిన పలు అంశాల్లో పట్టు సాధించి శభాష్ అనిపించుకున్నాడు ఉదయ్ శంకర్.ఇప్పుడు కంపెనీ పెట్టి కోట్లు సంపాదిస్తూ ఎంతో మందికి ఆదర్శం అవుతున్నాడు.