కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు.. మహాపురుషులౌతారు.. తరతరాలకి తరగని వెలుగౌతారు.. ఇలవేల్పులౌతారు.. అవును కదా.. మనిషి తలుచుకోవాలే కానీ చేయలేనిదంటూ ఏమీ ఉండదు. పేదరికం, ఇతర సమస్యల్లాంటివి ఏవి కూడా విజయానికి అడ్డంకులు కాదు. కేవలం మనిషికి ఉండాల్సిన ఆయుధాలు కృషి, పట్టుదల. ఇవి ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చని నిరూపించడు రమేశ్ ఘోలప్. ఆయనెవరు? ఏం నిరూపించాడో తెలుసుకోవాలనుందా? కర్చీఫ్ ఉంటే పక్కన పెట్టుకోని ఈ వార్త చదవండి.
అది మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలోని బర్షీ సమీపంలో ఉన్న మహాగోగన్ అనే గ్రామం. అదే గ్రామంలో జన్మించాడు రమేశ్ ఘోలప్. కడు పేదరికం. రోజుకు మూడు పూటలు అన్నం తినడం కూడా కష్టమే వాళ్ల ఫ్యామిలీలో. తండ్రి గోరఖ్ ఘోలప్ సైకిల్ షాప్ లో పనిచేసేవాడు. తండ్రి మద్యానికి బానిస. పనిచేయగా వచ్చిన డబ్బులతో తాగేవాడు. దీంతో రమేశ్ కు చిన్నప్పటి నుంచే కష్టాలు మొదలయ్యాయి. తాగుడుకు బానిసయిన రమేశ్ తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతంతా రమేశ్ తల్లి విమలపైనే పడింది. వాళ్ల దగ్గర వీళ్ల దగ్గర ఇంత అప్పు తీసుకొచ్చి ఓ గాజుల షాపు పెట్టింది విమల. రమేశ్ చిన్నగా ఉన్నప్పుడే అతడికి పోలియో సోకింది. దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది రమేశ్ కు. మహాగోగన్ ఊర్లో ఉన్న ప్రైమరీ స్కూల్ లో చదువుతూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. తల్లితో కలిసి గాజులమ్మేవాడు.
అయితే.. రమేశ్ అందరి పిల్లల్లా కాదు.. చాలా తెలివికలవాడు. చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవాడు. పేదరికాన్ని జయించాలంటే బాగా చదవుకోవాలని చిన్నప్పటి నుంచి నమ్మేవాడు. ఆదిశగా కష్టపడేవాడు. సమయం దొరికినప్పుడల్లా అమ్మకు సాయపడుతూనే తన చదువును కొనసాగించేవాడు. ఎలాగోలా ఉన్నత విద్యను 88 శాతం మార్కులతో పూర్తిచేశాడు. ఆ తర్వాత చదువుకోవడానికి డబ్బులు లేక ఓ టీచర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు.
ఆసమయంలోనే తన తల్లికి రావాల్సిన పించన్ రాకపోవడం, అధికారులు తమ ఊరును కూడా పట్టించుకోకపోవడం రమేశ్ ను చాలా బాధించాయి. ఈ పరిస్థితులను మార్చాలంటే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని పూనుకున్నాడు. దీంతో తను పనిచేస్తున్న స్కూల్ టీచర్ల సహకారంతో, తన తల్లి సాయంతో సివిల్స్ కు ప్రిపేర్ అవడం ప్రారంభించాడు. కోచింగ్ తీసుకోవడానికి డబ్బులు లేకున్నా.. సొంతంగా ప్రిపరేషన్ సాగించి ఒకే అటెంప్ట్ లో సివిల్స్ సాధించాడు. ఇప్పుడు సివిల్స్ ప్రిపేరయ్యే విద్యార్థుల కోసం సొంతంగా ఓ సంస్థను ఏర్పాటు చేసి ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తున్నాడు. ప్రస్తుతం జార్ఖండ్ ఎనర్జీ డిపార్ట్ మెంట్ లో జాయింట్ సెక్రటరీగా రమేశ్ పనిచేస్తున్నాడు. ఇప్పుడు అంతా సెటిల్ అయింది. తన తల్లిని కూడా బాగా చూసుకుంటున్నాడు. డబ్బులకు కొదవ లేదు. కడు పేదరికం నుంచి వచ్చి గాజులు అమ్మి.. ఎవరి సాయం లేకుండా ఐఏఎస్ సాధించడమనేది అంత ఈజీ కాదు. కానీ.. రమేశ్ తన కృషి, పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. ఇప్పుడు ఆ ప్రాంతంలో హీరో అయ్యాడు. సివిల్స్ ప్రిపేర్ అయ్యే ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచాడు. తన ఊరు బాగోగులను కూడా ఇప్పుడు రమేశే చూస్తున్నాడు. వావ్.. గ్రేట్ కదా..