నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో నివాసం ఉండే పోశన్న అనే వ్యక్తి కుమార్తె ఆకుల మమత. జూలైలో చైనాలో పలు ఎంపిక చేసిన విద్యా సంస్థల్లో జరగనున్న ఇంటర్న్‌షిప్‌లలో 6 వారాల పాటు పాల్గొననుంది.
గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతీ యువకులు సరిగ్గా చదువలేరు అని కొందరు అంటుంటారు. అయితే సరిగ్గా వెదకాలే కానీ మనకు ఆ ప్రాంతాల్లోనూ చదువులో వికసించిన కుసుమాలు కనిపిస్తాయి. అవును, ఇప్పుడు మేం చెప్పబోతున్నది సరిగ్గా ఇదే కోవకు చెందిన ఓ యువతి గురించే. ఆమె ఎక్కడో మారుమూల పల్లె నుంచి వచ్చింది. అయినా సరే.. చదువులో అంకిత భావం కనబరుస్తూ ఒక్కో మెట్టూ ఎదిగింది. ఇప్పుడు ఆమె చూపిన ప్రతిభకు ఏకంగా విదేశాల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం దక్కింది. ఇంతకీ ఆ యువతి ఎవరంటే..?
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో నివాసం ఉండే పోశన్న అనే వ్యక్తి కుమార్తె ఆకుల మమత. మమత కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న కాగజ్‌నగర్‌లోని నవోదయ విద్యాలయలో ఇంటర్ చదివింది. అనంతరం ఉట్నూర్‌లో ఉన్న ట్రైబల్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలో బీఎస్‌సీ (ఎంపీసీఎస్) మొదటి సంవత్సరం విద్యను అభ్యసిస్తోంది. అయితే మమత మొదటి సెమిస్టర్‌లో 9.07 గ్రేడ్ పాయింట్స్ యావరేజ్ (జీపీఏ) సాధించి మొదటి స్థానంలో నిలిచింది. దీంతో ఆమె చైనాలో జరగనున్న ఓ ఇంటర్న్‌షిప్‌కు సెలెక్ట్ అయింది.
సదరు కాలేజీ నుంచి ఆ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన మొదటి విద్యార్థినిగా మమత గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే అసోసియేషన్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇన్ ది ఫీల్డ్ ఎకనామిక్స్ అండ్ కామర్స్ (ఏఐఈఎస్ఈసీ) అనే ఎన్‌జీవో మమతకు సహాయం అందిస్తోంది. దాంతో మమత జూలైలో చైనాలో పలు ఎంపిక చేసిన విద్యా సంస్థల్లో జరగనున్న ఇంటర్న్‌షిప్‌లలో 6 వారాల పాటు పాల్గొననుంది. అందులో పాల్గొనే విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, సుస్థిర ప్రగతిని సాధించేందుకు చేరుకోవాల్సిన లక్ష్యాలు, ఆకలి చావులు లేని సమాజం, నాణ్యమైన విద్యను అందించడం ఎలా..? వంటి అంశాలను తెలుసుకునే అవకాశం కల్పిస్తారు. కాగా మమత ఈ ఘనత సాధించినందుకు తోటి విద్యార్థినులు, కాలేజీ అధ్యాపకులు ఆమెను ప్రస్తుతం అభినందిస్తున్నారు..!