ప్రతాప్ చంద్ర సారంగి బీజేపీ నేత. ఈ సారి జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బాలాసోర్ నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. ఈయన్ను అందరూ ఒడిశా మోదీ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు.
రాజకీయ నాయకులంటే సాధారణంగా కోట్లకు పడగలెత్తి ఉంటారు. ఎన్నికల్లో ఎంత డబ్బైనా సరే ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగానో, ఎంపీగానో గెలవాలనుకుంటారు. ఇక నిజంగానే ఒకవేళ ఏదైనా పదవిలోకి వస్తే.. వందల కోట్లు సంపాదిస్తారు. నేటి తరుణంలో చాలా మంది రాజకీయ నాయకులు చేస్తున్నదిదే. కానీ ఒడిశాకు చెందిన ఆ రాజకీయ నాయకుడు మాత్రం ఇందుకు భిన్నం. ఎంపీ అయినప్పటికీ ఆయన ఒక పూరింట్లోనే నివాసం ఉంటారు. బీద జీవితం గడుపుతారు. ఆయనే ఒడిశా మోదీ.. ప్రతాప్ చంద్ర సారంగి.
ప్రతాప్ చంద్ర సారంగి బీజేపీ నేత. ఈ సారి జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బాలాసోర్ నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. ఈయన్ను అందరూ ఒడిశా మోదీ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. ఈయన ఈ నియోజకవర్గంలో అంతకు ముందు 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా సేవలందించారు. అయినప్పటికీ ఆయన అందరు రాజకీయ నాయకుల్లా ఏమీ సంపాదించలేదు. అంతా ప్రజల కోసమే ఈయన ఖర్చు పెట్టారు. ఇక సారంగికి ఇంకా పెళ్లి కాలేదు. ఆయనకంటూ ఓ కుటుంబం లేదు. ప్రజలే ఆయన కుటుంబం.
ప్రతాప్ చంద్ర సారంగి తనకు జీతంగా వచ్చే సొమ్మునంతా ప్రజా సేవకే వినియోగిస్తూ వస్తున్నారు. ఇక ఆయన్ను చూస్తే పేదవాడిలా కనిపిస్తారు. కుర్తా పైజామాలు ధరిస్తారు. భుజానికి ఎప్పుడూ బ్యాగ్ ఉంటుంది. గుబురు గడ్డం ఉంటుంది. అస్సలు ఆడంబరంగా కనిపించరు. సాధారణ జీవితమే గడుపుతారు. అలాగే బయటకు వెళ్లాలంటే ఈయన కేవలం సైకిల్‌పైనే వెళ్తారు. ఇక ఈ సారి జరిగిన ఎన్నికల్లో ఎలాంటి ప్రచారం లేకుండానే, డబ్బు ఖర్చు పెట్టకుండానే సారంగి ఎంపీగా గెలిచారు. ఇదీ ఆయన గొప్పతనం.
సాధారణంగా ఎంపీ కావాలంటే కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టాలి. కానీ సారంగి మాత్రం ఎలాంటి ఖర్చు లేకుండానే ఈ సారి ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈయన ఎంపీగా పోటీ చేసినా ఓడిపోయారు. కానీ ఈ సారి మాత్రం తన సమీప అభ్యర్థి రవీంద్ర కుమార్ (బీజేడీ)పై 12,956 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రజల కష్టాలు, కన్నీళ్లను తెలుసుకుంటూ మసలే నేత కనుకనే సారంగిని ప్రజలు ఆదరించారు. ఎంపీగా గెలిపించారు. అవును, నిజంగా ఇలాంటి సాధారణ జీవితం గడిపే వారే అసలు సిసలైన రాజకీయ నాయకులు. వారే మనకు కావాలి.. డబ్బు కోసం గడ్డితినే నేతలు మనకు అక్కర్లేదు. ఏది ఏమైనా.. సారంగి మాత్రం నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శనీయం అనే చెప్పాలి..!