ఇంజినీర్‌ ఉద్యోగాన్ని వదిలి.. భారతీయ నృత్యాలను నేర్చుకుంటుందీ విదేశీ మహిళ..!

-

బల్గేరియాకు చెందిన మహిళ కట్యా టొషేవాకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు అన్నా, ఇక్కడి నృత్యాలు అన్నా ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే ఆమె తన దేశంలో చేస్తున్న ఇంజినీర్‌ ఉద్యోగాన్ని కూడా వదులుకుంది. అనంతరం భారత్‌కు వచ్చి పలు నృత్యాలను నేర్చుకుంది.

భారతదేశమంటేనే అనేక సంస్కృతులు, సంప్రదాయాలకు పుట్టినిల్లు. ముఖ్యంగా ఇక్కడ పలు రాష్ట్రాల్లో ఉన్న అనేక రకాల నృత్య రీతులు ప్రపంచంలో మరెక్కడా లేవంటే అతిశయోక్తి కాదు. అందుకనే మన దేశంతోపాటు ఎంతో మంది విదేశీయులు కూడా భారతీయ శాస్త్రీయ నృత్యాలను నేర్చుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు. అయితే కేవలం కొందరు మాత్రమే వాటిని మనస్ఫూర్తిగా ఆకళింపు చేసుకుంటారు. వాటి వ్యాప్తికి కృషి చేస్తుంటారు. అలాంటి వారిలో ఆ విదేశీయురాలు కూడా ఒకరు. ఇంతకీ ఆమె ఎవరు ? ఏం చేసింది ? అంటే…

బల్గేరియాకు చెందిన మహిళ కట్యా టొషేవాకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు అన్నా, ఇక్కడి నృత్యాలు అన్నా ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే ఆమె తన దేశంలో చేస్తున్న ఇంజినీర్‌ ఉద్యోగాన్ని కూడా వదులుకుంది. అనంతరం భారత్‌కు వచ్చి పలు నృత్యాలను నేర్చుకుంది. అయితే ఆమె అలా మన నృత్యాలను నేర్చుకోవడమే కాదు, తిరిగి తమ దేశానికి వెళ్లి సొంతంగా డ్యాన్స్‌ స్కూల్‌ పెట్టి మన నృత్యాలను అక్కడి చిన్నారులకు ఆమె నేర్పిస్తోంది.

అలా కట్యా టొషేవా భారతీయ నాట్య కళలను విదేశాల్లో ప్రచారం చేస్తోంది. బల్గేరియాలోని సోఫియా అనే తన సొంత ఊరులో కయా పేరిట ఆమె ఓ డ్యాన్స్‌ స్కూల్‌ను ఏర్పాటు చేసింది. అందులోనే అక్కడి పిల్లలకు ఆమె భారతీయ నాట్య కళల్లో శిక్షణనిస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం కట్యా టొషేవా భరత నాట్యం, కథక్‌, ఒడిస్సీ నృత్యాలను నేర్చుకుంటోంది. అయితే ఆమె ఇప్పటికే తాను నేర్చుకున్న భారతీయ నృత్యాలను సెర్బియా, ఫ్రాన్స్‌ తదితర దేశాల్లో ప్రదర్శించింది కూడా. కాగా ఆరంభంలో ఆమెకు ఇక్కడి గురువులు చెప్పే కొన్ని పదాలు అర్థమయ్యేవి కావు. అయినా ఆమె కఠోర సాధన చేసి.. కష్టపడి భారతీయ నృత్యాలను నేర్చుకుంది. ఇంకా కొన్ని నాట్యాలను ఇప్పుడు నేర్చుకుంటోంది. ఏది ఏమైనా.. మన నృత్య రీతులకు ఇలా ప్రాచుర్యం కల్పిస్తున్న కట్యా టొషేవా చేస్తున్న సేవను మనం అభినందించాల్సిందే..!

Read more RELATED
Recommended to you

Exit mobile version