అగ్రరాజ్యం అమెరికా లో పోలీసులు ఆరేళ్ల చిన్నారిపై తమ ప్రతాపం చూపించారు. కేవలం ఉపాధ్యాయులతో అనుచితంగా ప్రవర్తించింది అన్న ఒక్క కారణం తో ఆ చిన్నారిని సంకెళ్ల తో బందించి మరి అరెస్ట్ చేసిన ఘటన వైరల్ గా మారింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడా లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే….. ఫ్లోరిడా లోని ఓర్లాండో పట్టణానికి చెందిన ఒక స్థానిక పాఠశాల లో చదువుకుంటున్న ఆరేళ్ల చిన్నారి ఉపాధ్యాయులతో అనుచితంగా ప్రవర్తించింది అంటూ పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు చేసింది. దీనితో హుటాహుటిన అక్కడకి చేరుకున్న పోలీసులు ఆ చిన్నారి పై తమ ప్రతాపం చూపించారు. చిన్నారిని మందలించి వెళ్లిపోవాల్సింది పోయి ఆ చిన్నారి చేతులకు సంకెళ్లు వేసి పోలీసు వాహనం ఎక్కించారు. అయితే అరెస్ట్ సమయంలో చిన్నారి ఒక్క అవకాశం ఇవ్వాలి అంటూ ఎంతగా ప్రాధేయపడినప్పటికీ పోలీసులు ఏమాత్రం కనికరించకుండా ఆ చిన్నారిని అరెస్ట్ చేసిన వైనం విమర్శల పాలైంది. ఆ చిన్నారిని అరెస్ట్ చేసిన పోలీసులు డైరెక్ట్ గా స్టేషన్ కు తీసుకెళ్లారు.
అయితే ఈ దృశ్యాలు రికార్డ్ అవ్వడం తో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. అయితే ఈ వీడియో చూసిన నెటిజనులు తమదైన శైలి లో కామెంట్లు పెట్టారు. ఆరేళ్ల చిన్నారి ఒక నల్ల జాతీయురాలు కాబట్టే పోలీసులు ఆలా నిర్ధాక్షణ్యంగా ప్రవర్తించారు అంటూ మండిపడుతున్నారు. మరోపక్క ఈ వీడియో వైరల్ గా మారి పోలీసులపై విమర్శలు వెల్లువెత్తడం తో ఉన్నతాధికారులు ఆ చిన్నారిని అరెస్ట్ చేసిన పోలీసులను సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది.