రెండు మనస్సులు కలవాలే కానీ.. అందుకు వయస్సుతో సంబంధం లేదు. ప్రేమకు వయస్సు ఏ మాత్రం అడ్డం కాదు. అవును, సరిగ్గా ఇదే సూత్రాన్ని పాటించారు ఆ ఇద్దరూ. అతనికి 67 ఏళ్లు. ఆమెకు 24 సంవత్సరాలు. వారి మనస్సులు కలిశాయి. అంతే.. ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వారికి వయస్సు అడ్డంకి కాలేదు. అయితే తమ కుటుంబాలకు ఈ వివాహం నచ్చలేదు. దీంతో వారికి బెదిరింపులు వచ్చాయి. అయినా వారు భయపడలేదు. కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆ జంటకు భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. వివరాల్లోకి వెళితే…
పంజాబ్‌లోని ధురి సబ్‌డివిజన్ పరిధిలో ఉన్న బలైన్ గ్రామానికి చెందిన షంషేర్ సింగ్ వయస్సు 67 సంవత్సరాలు. అదే గ్రామానికి చెందిన నవ్‌ప్రీత్ కౌర్ వయస్సు 24 సంవత్సరాలు. వీరిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. దీంతో పెద్దల అనుమతి లేకుండానే నవ్‌ప్రీత్ కౌర్ షంషేర్ సింగ్‌ను వివాహం చేసుకుంది. వీరిద్దరూ చండీగడ్‌లో ఉన్న ఓ గురుద్వారాలో వివాహం చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఇరు వర్గాలకు చెందిన కుటుంబ సభ్యులు నూతన వధూవరులను బెదిరించారు. పలువురి నుంచి వీరికి బెదిరింపులు కూడా వచ్చాయి. దీంతో వారు పంజాబ్-హర్యానా ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో షంషేర్ సింగ్, నవ్‌ప్రీత్ కౌర్‌ల ఫిర్యాదు స్వీకరించిన హైకోర్టు కేసు విచారించి వారికి రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది.
కాగా ఈ విషయంపై షంషేర్ సింగ్, నవ్‌ప్రీత్ కౌర్ ల తరఫు న్యాయవాది మోహిత్ సదన మాట్లాడుతూ… షంషేర్ సింగ్, నవ్‌ప్రీత్ కౌర్ లు తమ కుటుంబ సభ్యుల అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నారని, ఈ క్రమంలో తమ కుటుంబ సభ్యులు, ఇతరుల నుంచి వచ్చిన బెదిరింపుల నేఫథ్యంలో వారు కోర్టును ఆశ్రయించగా, కోర్టు వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యతను పోలీసులకు అప్పగించిందని, వారు తమ కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి తమకు ప్రాణహాని ఉందని చెబుతున్నారని, కనుక పోలీసులు వారికి భద్రత కల్పించాలని కోరారు. పెళ్లి చట్ట ప్రకారం జరిగిందని, వారిద్దరూ మేజర్లు కనుక పెళ్లిపై పూర్తి నిర్ణయం తీసుకునే హక్కు వారికి ఉందని మోహిత్ తెలిపారు. ఏది ఏమైనా… ఇప్పుడీ ప్రేమ వివాహం విషయం మాత్రం నెట్‌లో వైరల్ అవుతోంది..!