ఉల్లిగ‌డ్డ‌ల‌తో బ్లాక్ ఫంగ‌స్‌? క్లారిటీ ఇచ్చిన ఎయిమ్స్‌..

దేశంలో ఇప్పుడు క‌రోనాతో పాటు వ‌ణికిస్తున్న మ‌రో వ్యాధి బ్లాక్ ఫంగ‌స్‌. ఇప్పుడు దీని పేరు వింటేనే జ‌నాలు వ‌ణికిపోతున్నారు. అస‌లు ఇది ఎలా వ‌స్తుందో చాలా మందికి క్లారిటీ లేదు. అయితే క‌రోనా కార‌ణంగానే వ‌స్తుంద‌ని చాలామంది న‌మ్ముతున్నారు. ఇంకొంద‌రేమో సోష‌ల్ మీడియాలో దీనిపై చాలా ర‌కాలుగా ప్ర‌చారం చేస్తున్నారు. ఈ మ‌ధ్య ఎక్కువ‌గా కొన్ని ర‌కాల పోస్టులు భ‌యబ్రాంతుల‌కు గురి చేస్తున్నాయి.

మ‌నం వాడే ఉల్లిగడ్డల పొరల మీద నల్లగా ఉండే ఫంగస్‌తో బ్లాక్‌ఫంగస్‌ రావొచ్చు’ అని ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాగే వండిన కూరలను ఫ్రిజ్‌లో పెడితే.. వాటిమీద బ్యాక్టీరియా ఏర్ప‌డుతుంద‌ని, దీన్ని తింటే ఇది కూడా ప్ర‌మాద‌మేన‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

అలాగే ఫ్రిజ్‌లో నీళ్లబాటిళ్లు, కూరగాయలు పెట్టే చోట ఏదైనా నల్లగా పేరుకుపోయిన క‌నిపిస్తే.. అది బ్యాక్టీరియా అయ్యే ఛాన్స్ ఉంద‌ని, దాన్ని తాకితే బ్లాక్‌ ఫంగస్ సోకుతుందంటూ.. ఇలా ర‌క‌ర‌కాలుగా పోస్టులు వెలుస్తున్నాయి. వీటిని చూసిన వారంతా వ‌ణికిపోతున్నారు. అయితే వీటిపై ఆలిండియా మెడికల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) క్లారిటీ ఇచ్చింది. అవ‌న్నీ త‌ప్పుడు వార్త‌ల‌ని తేల్చి చెప్పింది. కూరగాయలు, వస్తువుల ద్వారా బ్లాక్‌ ఫంగస్ సోక‌ద‌ని, ఉల్లిగడ్డల మీద కనిపించే నల్లని పొర భూమిలో ఉండే ఫంగస్‌ వల్ల ఏర్పడుతుంది స్ప‌ష్టం చేసింది. అలాంటి వాటితో బ్లాక్ ఫంగ‌స్ రాద‌ని తేల్చి చెప్పింది. ఇలాంటి భూమిలో ఉండే ఫంగ‌స్‌లు, బ్యాక్టీరియా మ్యూకోర్మైకోసిస్‌కు కారణం కాదని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా వివ‌రించారు.