నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ పేరును మార్చాలనే ఆలోచనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పీడీఎస్ యూ, ఎస్ఎఫ్ఐ విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్, ఎస్ఎఫ్ఎ యూనివర్సిటీ అధ్యక్షుడు జే. శివలు మాట్లాడుతూ.. ఎన్నో ఉద్యమాల పోరాట ఫలితంగా, ఎంతో మంది బలిదానాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు.
అదే ఉద్యమ స్ఫూర్తితో జిల్లాలోని విద్యార్థినీ, విద్యార్థులు, నాయకులు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు అందరూ కలిసి కట్టుగా ఉద్యమించడం కారణంగానే ఈ తెలంగాణ యూనివర్సిటీని తెలంగాణ యూనివర్సిటీ పేరుతో ఏర్పాటైందన్న విషయాన్ని వారు గుర్తు చేశారు. ఇప్పుడు యూనివర్సిటీ పేరును మార్చాలనే ఆలోచన దుర్మార్గ మైందన్నారు. యూనివర్సిటీ పేరును మార్చాలనే ఆలోచనను ఉపసంహరించుకోవాలని, ముందుగా తెలంగాణ యూనివర్సిటీ లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని కోరారు. తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్చాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.