నిత్యం సూర్యరశ్మిలో 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంటే మన శరీరం విటమిన్ డిని తయారు చేసుకుంటుందన్న సంగతి తెలిసిందే. విటమిన్ డి మన శరీరంలో ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు, శరీర రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఎంతగానో దోహదపడుతుంది. ఇక విటమిన్ డి మనకు పలు ఆహారాల్లోనూ లభిస్తుంది. అయితే విటమిన్ డి పుష్కలంగా ఉంటే.. ఎవరికైనా సరే.. కరోనా తీవ్రతరమయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని సైంటిస్టులు తేల్చారు.
డబ్లిన్లోని ట్రినిటీ కాలేజ్ (టీఐఎల్డీఏ) సైంటిస్టులు విటమిన్ డికి, కోవిడ్ 19 ఇన్ఫెక్షన్కు మధ్య ఉన్న సంబంధాన్ని కనుగొనేందుకు తాజాగా పరిశోధనలు చేశారు. ఈ మేరకు వారు తమ పరిశోధనల వివరాలను వెల్లడించారు. విటమిన్ డి వల్ల కరోనా తీవ్రత చాలా వరకు తగ్గుతుందని చెబుతున్నారు. విటమిన్ డి పుష్కలంగా ఉన్నవారిలో కరోనా అంత తీవ్రతరం కాదని, అలాగే అలాంటి వారు కరోనాతో చనిపోయే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయని చెబుతున్నారు.
ఇక భారత్ వంటి దేశాల్లో ప్రజలలో విటమిన్ డి స్థాయిలు ఎక్కువగా ఉంటాయని.. అందువల్లే ఆయా దేశాల్లో కరోనా ప్రభావం తక్కువగా ఉందని సదరు సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అలాగే అమెరికా, యూకే దేశాల్లో ప్రజల్లో విటమిన్ డి లోపం ఎక్కువగా ఉందని, అందునే అక్కడ కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని అంటున్నారు. అయితే శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు విటమిన్ డి తోపాటు ఇతర అన్ని పోషకాలు ఉన్న ఆహారాలను నిత్యం తీసుకోవాలని సైంటిస్టులు సూచిస్తున్నారు..!