కుక్కలను పెంచుకునే వారిలో కొందరు తమ కుక్కలను అందంగా తీర్చిదిద్దాలనుకుంటారు. అందుకనే వారు కుక్కలకు దుస్తులు వేయడం, మేకప్ వేసి అందంగా అలంకరించడం చేస్తుంటారు. అయితే అంతా బాగా కుదిరితే బాగానే ఉంటుంది. లేదంటే మొదటికే మోసం వస్తుంది. ఓ థాయ్ మహిళకు కూడా సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. కుక్క చెవులు, తోకకు రంగు వేసి అందంగా అలంకరించాలనుకుంది. కానీ ఆ రంగు వేశాక తన కుక్క చెవి ఒకటి ఊడి వచ్చింది. ఇంతకీ అసలు జరిగిన విషయం ఏమిటంటే…
థాయ్‌లాండ్‌కు చెందిన ఓ మహిళ కుక్క పేరు డిఫీ. అది పొమెరేనియన్ జాతికి చెందినది. దాని చెవులు పైకి నిక్కబొడుచుకుని ఉంటాయి. అయితే ఆ కుక్క తోక, చెవులకు ఆ మహిళ ఎరుపు రంగు వేయించాలనుకుంది. అందుకనే ఆమె తమకు దగ్గర్లో ఉన్న ఓ పెట్ గ్రూమింగ్ షాపుకు వెళ్లింది. అందులో ఉండే పెట్ సెలూన్‌లో బ్యుటిషియన్లచే కుక్క తోక, రెండు చెవులకు ఎరుపు రంగు డై వేయించింది. అందుకు 40 నిమిషాల సమయం పట్టింది. అయితే డై వేయగానే ఆ కుక్క చెవి ఒకటి కిందకు వాలిపోయింది. దీంతో ఆ మహిళ కంగారెత్తిపోయింది.
తన కుక్క చెవి అలా వంగిపోయింది ఎందుకని పెట్ సెలూన్ వారిని అడగ్గా, అందుకు వారు సమాధానమిస్తూ.. అదంతా సహజమేనని రెండు, మూడు రోజుల్లో కుక్క చెవి బాగై పైకి వస్తుందని వారు తెలిపారు. దీంతో అప్పటికి ఓకే అనుకున్న ఆ మహిళ ఇంటికి వెళ్లింది. అయితే రెండు రోజులు కాకుండానే ఆ కుక్క చెవులు ఎరుపెక్కాయి. ఆ డై కుక్కకు పడలేదు. దీంతో వాలిపోయిన ఆ కుక్క చెవి కాస్తా ఊడి కింద పడిపోయింది. దాన్ని చూసి ఆ మహిళ షాకైంది. అయితే ఇలా జరుగుతుందా ? అంటూ ఆ మహిళ విషయాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టగా, ఆమెను నెటిజన్లు ఏకి పారేశారు. నీ సరదా కోసం కుక్క చెవి ఇలా ఊడగొడతావా అంటూ ఆమెను విమర్శించారు. దీంతో అవాక్కవడం ఆ మహిళ వంతైంది. ఏది ఏమైనా.. మీకు గనక కుక్క ఉంటే ఇలాంటి సరదాలు చేయకండి. పాపం.. వాటికేం తెలుసు.. అలంకరణల గురించి..!