ఆల‌యంలో ఎడ‌మ‌కాలు పెడితే ఇలా చేస్తారా.. వ‌ధువుకు ఝ‌ల‌క్ ఇచ్చిన ఆడ‌ప‌డుచు!

పెళ్లి చేసుకుని మెట్టినింట ఆనందకరంగా జీవించాలని అనుకున్న ఓ యువతికి పెళ్లైన మరుసటి రోజు నుంచే వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం మెట్టినింటి వారు ఎన్ని కష్టాలకు గురి చేసినా, కొన్ని రోజుల తర్వాత బాగానే ఉంటుందని భావించింది. అయితే, రోజులు గడిచే కొద్దీ ఆమెకు వేధింపులు మరిన్ని ఎక్కువ కావడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మహారాష్ట్రలోని నిగ్ది ఏరియాకు చెందిన 27 సంవత్సరాల యువతికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో 2020, డిసెంబర్‌లో వివాహం జరిగింది. పెళ్లి కొడుకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండటంతో, వివాహం జరిగిన కొద్ది కాలం తర్వాతే ఇరవై తులాల బంగారం, లక్ష రూపాయల నగదును కట్నంగా ఇచ్చారు. ఇంత వరకూ బాగానే ఉంది కానీ, వారు అదనపు కట్నం వేధించడానికి యువతి ఏదైన తప్పు చేయాలని వేచి చూశారు. అయితే, పెళ్లి తర్వాత అత్తింటి వారు, బంధువులు అందరూ కలిసి గుడికి వెళ్లగా, ఆమె కుడి కాలు బదులు మర్చిపోయి ఎడమకాలు గుడి ద్వారం ముందు పెట్టి గుళ్లోకి ప్రవేశించింది.

దీంతో అనుకున్నదే తడవుగా, ఆమె ఆడపడుచు ఆ యువతిని బంధువులు, కుటుంబ సభ్యుల ముందు చెంప మీద కొట్టింది. అంతే కాకుండా అదనపు కట్నం తీసుకుని రాకపోతే పుట్టింటికి పంపుతామని ఆమెను బెదిరిస్తూ మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేయసాగారు. తల్లిదండ్రులు ఇప్పటికే ఆర్థిక స్ధోమతకు మించి కట్నకానుకలు ఇచ్చారని, మళ్లీ వాళ్లని అదనపు కట్నం అడిగితే ఇవ్వలేని పరిస్థితులో ఉండటమే కాకుండా, బాధపడతారని యువతి భావించింది. ఇంతలోనే అత్తింటి వారితో కలిసి భర్త కూడా వేధింపులకు గురి చేస్తుండటంతో విసుగెత్తిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.