ఉంగరం.. ఆ వేలికే ఎందుకు పెట్టుకోవాలి ?

Ringచూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, చివరిది చిటికిన వేలు. ఇన్ని వేళ్లు ఉండగా ఉంగరం ఆ వేలుకే ఎందుకు పెట్టుకుంటారు అని చాలామందికి సందేహం వస్తుంటుంది…

అసలు విషయం తెలియని చాలామంది అది ఉంగరపు వేలు. ఉంగరం దానికే పెట్టుకోవాలి అని పిల్లలకు చెబుతుంటారు. కానీ, అది వాస్తవం కాదు. ఉంగరపు వేలుని సంస్కృతిలో అనామిక అని అంటారు. అంటే పేరు పెట్టని వేలు అని అర్థం. జీవితంలో ఒకసారి వచ్చే పెండ్లి వేడుకలో వధూవరులు ఒకరి చేతికి మరొకరు ఉంగరం తొడుగుతారు. అప్పుడు కూడా ఉంగరం వేలునే ఎంచుకుంటారు. అలా ఆ వేలుకు ఉంగరం పెడితే ఒకరి స్పందనలు ఒకరికి తాకుతాయని నమ్మకం.

ఆ వేలుకే ఎందుకు?

శరీరంలో ఉండే ప్రతి భాగం అరికాలులో కనబడుతుంది అంటారు. ఏ భాగానికైనా నొప్పి ఉంటే అరికాలిలో నొక్కితే తగ్గుతుంది అంటారు. అలా చేతి ఉంగరపు వేలుకు, చెవికి మధ్య సంబంధం ఉంటుంది. ఒకసారి కుడిచేతి ఉంగరపు వేలును గట్టిగా నొక్కి చూడండి. దీని స్పందన కుడిచెవి దగ్గర ఉంటుంది. అలాగే ఎడమచేతి ఉంగరపు వేలుని నొక్కినా ఎడమచెవి దగ్గర ప్రతిస్పందిస్తాయి. అయితే మహిళలకు చెవులు కుట్టిస్తుంటారు. దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం చేతి నాలుగవ వేలుకి ఆభరణంగా ఉంగరం ధరించడం మొదలుపెట్టారు. ఇప్పుడు మగవాళ్లు కూడా చెవులు కుట్టించుకోవడం ట్రెండ్‌గా భావిస్తున్నారు. మరి ఉంగరం ఏ చేతి వేలుకి ధరించాలో అని సందేహంలో ఉన్నవాళ్లు చాలామందే ఉన్నారు. కొంతమంది కుడిచేతికి పెట్టుకోవడానికి మొగ్గుచూపుతారు. మరికొందరికి ఎడమ చేయి బాగుంటుందని దానికే పెట్టుకోవాలనుకుంటారు.

వాస్తవానికి ఏ చేతికి పెట్టుకోవాలో అన్న దానికి కూడా ఓ పరమార్ధం ఉన్నది. పూర్వంలో ఉంగరాన్ని కుడిచేతికే ధరించేవారు. అది కూడా రాగి ఉంగరాన్నే ఎంచుకునేవారు. ఎందుకో తెలుసా? చాలామంది కుడిచేతితోనే అన్నం తింటారు. అనుకోకుండా ఆహారం విషతుల్యం అయినప్పుడు (పాయిజన్ కలిసినప్పుడు) రాగి ఉంగరం ధరించిన చేయి ఆహారంలో పెట్టగానే ఆ ఉంగరం కాస్త నీలిరంగులోకి మారుతుందట. దాంతో ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు అన్నది వారి అభిప్రాయం. అందుకే వారు రాగితో చేసిన ఉంగరాన్నే అది కూడా కుడిచేతి నాల్గవ వేలికే ధరించేవారట. ఉంగరం ఎడమచేతికి ధరిస్తే గుండెకు మేలు జరుగుతుందని చెబుతున్నారు.

తెలియకుండానే మంచి జరుగుతుంది

చాలామంది ఖాళీగా ఉండడంతో పొద్దుపోదు. దాంతో గోర్లు కొరకడం, చేతికి ఉన్న ఉంగరాలను పెడుతూ తీస్తూ ఉంటారు. ఒక్కోసారి అలా తీసిన ఉంగరం అక్కడే మర్చిపోయి ఇంట్లో తిట్లు తిన్న సందర్భాలు కూడా ఉండి ఉంటాయి. అలా ఉంగరం తీసి పెడుతూ ఉంటావెందుకని పక్కన వాళ్లు కూడా అంటుంటారు. ఇదీ ఒకందుకు మంచిదే అంటున్నారు. ఎందుకంటారా? వేలి ఉంగరాన్ని సగం వరకు తీస్తూ పెడుతూ ఉండడం వల్ల వేలు మీద కొంచెం ఒత్తిడి పడుతుంది. ఇది కిడ్నీల పనితీరును, నరాల తీరును మెరుగుపరుస్తుందట. అందుకే ఉంగరాన్ని ఆభరణంగా కాకుండా ఆరోగ్య ప్రధాయినిగా వాడడం మంచిదేనట.