కరోనా మహమ్మారితో భయాందోళనలకు గురవుతున్న జనాలకు సింగపూర్ పరిశోధకులు గుడ్ న్యూస్ చెప్పారు. మే 21వ తేదీ వరకు భారత్‌లో కరోనా వైరస్ దాదాపుగా ఉండదని చెబుతున్నారు. ఈ మేరకు సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ పరిశోధకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పలు గణాంకాలను విశ్లేషించి ఈ వివరాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రపంచంలోని ఆయా దేశాల్లో కరోనా వైరస్ ఏయే తేదీల వరకు దాదాపుగా నశిస్తుందో కూడా వారు అంచనా వేసి చెబుతున్నారు.
ఏప్రిల్ 24వ తేదీ వరకు ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల వివరాలతోపాటు పలు ఇతర గణాంకాలను కృత్రిమ మేథ ద్వారా విశ్లేషించిన సింగపూర్ పరిశోధకులు.. ఆయా దేశాల్లో కరోనా ఎప్పటి వరకు అంతం అవుతుందో అంచనా వేసి చెబుతున్నారు. ఈ క్రమంలో భారత్‌లో మే 21వ తేదీ వరకు కరోనా 97 శాతం వరకు తగ్గుతుందని వారు తెలిపారు. అలాగే సింగపూర్ లో జూన్ 4, అమెరికాలో మే 11, ఇటలీలో మే 7, ఇరాన్‌లో మే 10, టర్కీలో మే 15, యూకేలో మే 9, ఫ్రాన్స్‌లో మే 3, జర్మనీలో ఏప్రిల్ 30, కెనడాలో మే 16వ తేదీ వరకు కరోనా 97 శాతం వరకు తగ్గుతుందని సదరు పరిశోధకులు వెల్లడించారు.
ఇక ఈ అంచనాలు నిత్యం నమోదయ్యే కొత్త కరోనా కేసుల ప్రకారం మారే అవకాశం కూడా ఉంటుందని వారంటున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ 100 శాతం అంతం అయ్యేందుకు డిసెంబర్ 8 తేదీ వరకు సమయం పడుతుందని వారు తెలిపారు. మరి అప్పటి వరకు ఇంకా ఎంత ప్రాణ నష్టం సంభవిస్తుందో, సైంటిస్టులు కరోనాకు వ్యాక్సిన్‌ను కనిపెడతారో, లేదో.. చూడాలి..!