దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. బీహార్లోని భాగల్పూర్లో ఏర్పాటు చేసిన భారీ సభలో అభివృద్ధి ప్రాజెక్టులు, 19వ విడుత నిధులను ప్రధాని మోడీ బటన్ నొక్కి ప్రారంభించారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 9.80 కోట్ల మంది చిన్న, మధ్య తరహా రైతులకు నేరుగా ఖాతాల్లో కిసాన్ సమ్మాన్ నిధిని రూ.2 వేలు జమవుతాయి. 19వ విడతలో దాదాపు 9.80 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు దాదాపు రూ.22 వేల కోట్లు బదిలీ చేయబడుతాయి.
ప్రధాని మోడీతో పాటు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సభలో ప్రధాని మోడీ, బీహార్ సీఎం నితీశ్ కుమార్ నవ్వుతూ మాట్లాడుకోవడం అందరినీ ఆకర్షించింది. సభకు హాజరయ్యే ముందు భాగల్పూర్లో ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించారు. కాగా, ఈ పథకం కింద రూ.2 వేలు చొప్పున 3 దఫాలుగా రూ.6 వేలు ఒక్కో రైతుకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తున్న విషయం తెలిసిందే. 2019లో ప్రారంభం అయిన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 18 విడతల్లో రూ.3.46 లక్షల కోట్లు రైతుల అకౌంట్లలో కేంద్రం జమ చేసింది.